కౌంటింగ్‌లో అల్లర్లకు టీడీపీ ప్లాన్‌

22 May, 2019 12:37 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికల ఫలితాలపై 43 రోజుల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎవరు విజేతగా నిలుస్తారో.. ఎవరు పరాజయాన్ని చవిచూస్తారో.. కొన్ని గంటల్లో తేలిపోనుంది. చంద్రబాబునాయుడుకు ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకోవడంతో కౌంటింగ్‌ను వివాదాస్పదంగా చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో తమకు ప్రతికూలంగా వచ్చే కౌంటింగ్‌ సెంటర్‌ల వద్ద అల్లర్లు సృష్టించాలని చంద్రబాబు నాయుడు భారీ స్కెచ్‌ వేశారు. టీడీపీ ఏజెంట్ల ద్వారా కౌంటింగ్‌ సెంటర్‌ల వద్ద గొడవలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా గొడవలు దిగే మనస్తత్వం ఉన్నవారినే ఏజెంట్లుగా పెట్టాలని నిర్ణయించారు. ఓడిపోయిన ప్రతి చోటా రీకౌంటింగ్‌ చేయాలని గొడవలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా వందశాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా గొడవలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే టీడీపీ ఏజెంట్లకు రెండు సార్లు శిక్షణ ఇవ్వగా, బుధవారం మరోసారి ఏజెంట్లందరికీ గొడవలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రతి ఏజెంట్‌కు చంద్రబాబు నాయుడు ఫోటోతో ముంద్రించిన ఒక ప్రత్యేకమైన బుక్‌లెట్‌ను కూడా ఇచ్చారు.

ముందుగానే రెండు ఫిర్యాదు నమూనా పత్రాలను టీడీపీ తయారు చేసింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా వందశాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించే డిమాండ్‌ను తెరపైకి తీసుకురావాలని చూస్తున్నారు. ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఫిర్యాదులకు భారీ స్కెచ్‌ వేశారు. ఓడిపోయే చోట ప్రతి రౌండ్‌లోనూ రీకౌంటింగ్‌కు గొడవ చేయాలని ఏజెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎంలపై నెంబర్లు కనపడలేదని ఫిర్యాదు చేయాలని ఏజెంట్లకు సూచించారు. పదేపదే ఫిర్యాదులు చేసి, ఎన్నికల ఫలితాల్లో జాప్యం జరిగేలా చూడాలని టీడీపీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. వీటిపైన ఎన్నికల సంఘం కూడా దృష్టిపెట్టింది. ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఎలా చేయాలన్నదానిపై ఆర్‌ఓలు, అబ్జర్వర్లకు ఈసీ ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వనుంది.

మరిన్ని వార్తలు