ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

30 Sep, 2018 09:12 IST|Sakshi

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలప్రక్రియ ప్రారంభం 

ఓటర్ల నమోదుకు సోమవారం నోటిఫికేషన్‌ జారీ

చివరి తేదీ నవంబర్‌ 6, జనవరిలో తుది ఓటర్ల జాబితా ప్రచురణ

ఫిబ్రవరిలో ఎన్నికల జరిగే అవకాశం

సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు త్వరలో నగరా మోగనుంది. ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు పదవీ కాలం 2019 ఫిబ్రవరి 26వ తేదీతో ముగుస్తుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు నియోజకవర్గ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల నమోదు, సవరణకు సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. నవంబర్‌ 6వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు, సవరణ అనంతరం అభ్యంతరాలను పరిష్కరించి 2019 జనవరిలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. 

జనవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా జారీ చేసి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. శాసనమండలిని పునరుద్ధరించిన తర్వాత రెండోసారి 2013 ఫిబ్రవరిలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. నాడు 14,600 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు నమోదు చేసుకోగా వారిలో 12,996 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.నాటి ఎన్నికల్లో 21 మంది పోటీచేయగా, పంచాయతీరాజ్‌ ప్రొగ్రెస్సివ్‌ టీచర్స్‌ యూనియన్‌ (పీఆర్‌టీయూ) తరపున బరిలోకి దిగిన గాదె శ్రీనివాసులు నాయుడు తన ప్రత్యర్థి ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ అభ్యర్థి సింహాద్రప్పుడుపై గెలుపొందారు. ఈయన పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26వ తేదీతో ముగియనుం ది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందు న ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు మొదలైంది.

రేపటి నుంచే ఓటర్ల నమోదు
ఓటర్ల నమోదు, సవరణ, తుది ఓటర్ల జాబితా తయారీపై నియోజకవర్గ ఎన్నికల అధికారైన విశాఖ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సోమవారం (అక్టోబర్‌–1) నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. విశాఖ కలెక్టర్‌ నేతృత్వంలో అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి హోదాలో విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి సి.చంద్రశేఖరరెడ్డి మూడు జిల్లాల్లో ఎన్నికలకు ముందస్తు ప్రక్రియ నిర్వహణకు మోనటరింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారు. మూడు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఓటర్లు ఎంతమంది ఉన్నారు. కొత్తగా ఎంత మంది నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పోలింగ్‌ కేంద్రాలు, కొత్తగా నమోదయ్యే ఓటర్ల సంఖ్యను బట్టి ఏ మేరకు కేంద్రాలు పెంచాలి, జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ అధికారులు, బూత్‌ లెవల్‌ అధికారుల నియామకం, శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.సోమవారం నుంచి మూడు జిల్లాల పరిధిలో ఓటర్ల నమోదు సవరణ ప్రక్రియకు ఆయా జిల్లాల అసిస్టెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించే డీఆర్‌ఒల పర్యవేక్షణలో చేపడతారు.

ఎవరు అర్హులు.. ఎలా నమోదు చేసుకోవాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవాలనుకునే వారు కనీసం ఆరేళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన వారై ఉండాలి.  2012 అక్టోబర్‌కు ముందు ఉపాధ్యాయ వృత్తిలో చేరి 2018 అక్టోబర్‌ వరకు ఫుల్‌టైం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు మాత్రమే ఓటుహక్కు నమోదుకు అర్హులుగా ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలు, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోవల్సి ఉంటుంది. 

ప్రైవేటు విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఓటు నమోదుకు హెడ్‌ ఆఫ్‌ ది ఇన్‌స్టిట్యూట్‌ జిల్లా విద్యా శాఖాధికారి, కళాశాలలైతే ఆర్‌ఐఒ, యూనివర్సిటీ సంబంధిత హెడ్స్‌ నుంచి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నట్టుగా ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులైతే ఓటు నమోదు సందర్భంలో విధిగా జీపీఎఫ్, ఈపీఎఫ్‌ సంబంధిత వివరాలు అందజేయాల్సి ఉంటుంది. మండల ఎన్నికల అధికారులకు స్వయంగా దరఖాస్తు చేయొచ్చు. అంతేకాకుండా ఈసారి ఆన్‌లైన్‌లో కూడా కొత్త ఓటర్లుగా చేర్పులు, మార్పులు, తప్పొప్పులు సవరణకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. ఇలా అందిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి చేర్పులు, మార్పులపై అభ్యంతరాలు పరిష్కరించి జనవరిలో తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.

ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన సేవలందించా..
ఉపాధ్యాయుల సంక్షేమానికి ఆరేళ్లుగా ఎనలేని సేవలందించా. ముఖ్యంగా సర్వీస్‌ రూల్స్‌ అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ తేవడం ఎంతో సంతృప్తినిచ్చింది. 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు పీఆర్సీలో ఉన్న తేడాలను సవరిస్తూ జీవో తీసుకొచ్చాం. 1400 మంది పీఈడీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయగలిగాం. విశాఖ, విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలందేలా జీవో తీసుకొచ్చాం. ఎయిడ్‌ఎడ్‌ ఉపాధ్యాయులకు అప్రంటీ‹స్‌షి ప్, నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ప్ర మోషన్లు, కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించేలా కృషి చేశాం. విశాఖలో డీఈవో కార్యాలయానికి సొంత భవనం నిర్మించడంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆర్జేడీ కార్యాలయాన్ని విశాఖకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలిగాం.            
– గాదె శ్రీనివాసులు నాయుడు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

>
మరిన్ని వార్తలు