పచ్చని పొలాల్లో చిచ్చు పెడతారా..?

30 Dec, 2014 08:35 IST|Sakshi

 ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
 ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి
 
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి, తూళ్ళురు మండలం వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం గ్రామాల్లో జరిగిన సంఘటనలను ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తీవ్రంగా ఖండించారు. ఆగ్రామాలను సందర్శించిన ఆయన పచ్చని పొలాల్లో రాజధాని చిచ్చు రాజేసిన పాపం రాష్ట్ర ప్రభుత్వందేనని విమర్శించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వ హించి రైతులకు నష్ట పరిహారం అందించడంతో పాటు భవిష్యత్‌లో ఇటువంటివి జరగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తలపెట్టిన భూ సమీకరణను వ్యతిరేకించిన గ్రామాల్లోనే ఇవి జరగడం గమనించాలన్నారు.
 
 ల్యాండ్ పూలింగ్ విధానం రైతులకు నష్టదాయకమన్నారు. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఎటువంటి ప్యాకేజి ప్రకటించక పోవడం పట్ల రైతులతో పాటు సామాన్య ప్రజలు కూడా అసంతృప్తి చెందుతుందన్నారు. రైతులను భయభ్రాంతులకు గురి చేయడానికే ఇలాంటి సంఘటనలు సృష్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. గ్రామాలలో రైతుల మధ్య గొడవలు పెట్టి ప్రభుత్వం తాను అనుకున్నది సాధించాలనుకుని ఇలాంటి చర్యకు పూనుకున్నట్లు రైతులు అనుమానిస్తున్నారన్నారు. దీని వల్ల గ్రామాల్లో శాంతి, భద్రతల సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగుకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
 
 శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. ఆదివారం ఆర్ధరాత్రి నుంచి జరిగిన సంఘటనలో 5చోట్ల పాక లు, 20వేల బొంగులు కాలి బూడిద య్యాయని నష్టం లక్షల రూపాయల్లో ఉంటుందని రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాశం రామారావు, కౌలు రైతు సంఘం నాయకులు వై.వి.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు