తెలంగాణలో భారీ ఎత్తున సభలు

24 Feb, 2014 01:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. నియోజకవర్గాలు, మండలాలవారీగా సభలు నిర్వహించి సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 25 నుంచి జిల్లా కేంద్రాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం గాంధీభవన్‌లో తెలంగాణ జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. తెలంగాణ ఇచ్చినందున ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్‌కే దక్కాలని, అందుకోసం కార్యక్రమాలు చేపట్టాలని బొత్స వారికి సూచించారు. తర్వాత ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు షబ్బీర్‌అలీ, జీహెచ్‌హెంసీ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు కృతజ్ఞతల పేరుతో జిల్లాల వారీగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. మార్చి మొదటివారంలో హైదరాబాద్‌లో తలపెట్టిన భారీ సభకు సోనియా రాబోతున్నారని తెలిపారు. అనంతరం వారు నిలువెత్తు సోనియా బొమ్మలతో కూడిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.


 
 గాంధీభవన్‌లో కిరణ్ బొమ్మ తొలగింపు
 
 గాంధీభవన్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్రపటాన్ని ఆది వారం తొలగించారు. ఆయన స్థానంలో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. గాంధీభవన్‌లోని మీడియా సమావేశ మందిరంలో నిన్నటి వరకూ సోనియా, రాహుల్, మన్మోహన్, దిగ్విజయ్, కిరణ్, బొత్స చిత్రపటాలతో కూడిన పెద్ద ఫ్లెక్సీ ఉండేది. ఆది వారం మీడియాతో మాట్లాడేందుకు సమావేశమందిరానికి వచ్చిన షబ్బీర్‌అలీ, దానంలు ఫ్లెక్సీలో కిరణ్ చిత్రపటం ఉన్న విషయం గమనించి వెంటనే కిరణ్ ఫొటోను కప్పేశారు. తర్వాత కిరణ్ స్థానంలో ఆజాద్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు