టీడీపీ వెబ్‌సైట్‌ క్లోజ్‌.. అందుకేనా?

7 Mar, 2019 12:48 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో అధికార పార్టీపై ఆరోపణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయి. టీడీపీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే ‘ఎర్రర్‌’ అని చూపిస్తోంది. టీడీపీ యాప్‌ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై డేటా చోరీ ఆరోపణలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌ www.telugudesam.org షట్‌డౌన్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ సేవా మిత్ర యాప్‌ సమాచారం బయటపడకుండా ఉండేందుకే వెబ్‌సైట్‌ను మూసేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఆన్‌లైన్‌ సభ్యత్వాన్ని కూడా ఇంతకుముందే హఠాత్తుగా నిలిపివేశారు. (అంతా పథకం ప్రకారమే!)

మంత్రి నారా లోకేశ్‌తో ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ దాకవరం అశోక్‌కు సత్సంబంధాలున్నాయన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఏకంగా లోకేశ్‌తో కలిసి ఆయన అధికారిక సమీక్షా సమావేశంలో పాల్గొన్న విషయం బయటపడింది. గుట్టురట్టు కావడంతో అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. మరోవైపు ఐటీ గ్రిడ్స్‌, బ్లూ ఫ్రాగ్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల్లో మార్పులు చేయాలని మంత్రి లోకేశ్‌ ఆదేశించడంతో ఉన్నతాధికారులు ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ ఫైళ్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. డేటా చోరీ కేసులో అన్నివైపుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు సర్కారు దీని నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నట్టు కనబడుతోంది. (అధికారిక సమీక్షల్లో అశోక్‌ దర్జా!)

మరిన్ని వార్తలు