తెలుగు ప్రజలను చీలిస్తే ఊరుకోం

29 Aug, 2013 03:40 IST|Sakshi

బనగానపల్లె, న్యూస్‌లైన్: ఒకే భాష మాట్లాడుతూ.. సమైక్యంగా ఉంటున్న తెలుగు ప్రజలను చీలిస్తే చూస్తూ ఊరుకోబోమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది.
 
 ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి రామిరెడ్డికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ సమ న్యాయం చేయాలనే వైఎస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి కోరుతుందన్నారు. విభజనకు మొదటి ముద్దాయి చంద్రబాబు అయితే.. రెండో ముద్దాయి సోనియాగాంధీయేనన్నారు. ఇటలీ దేశానికి చెందిన సోనియా సీమాంధ్ర ప్రజల మనోభావాలను తెలుసుకోలేక విభజనకు సిద్ధపడ్డారన్నారు. సమైక్యాంధ్రను రెండుగా చీల్చడాన్ని ప్రజలెవరూ కోరుకోవడం లేదన్నారు.
 
 చంద్రబాబు స్వస్థలం చిత్తూరు జిల్లా కుప్పం అయినా.. ఆయన ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉండటం వల్లే తెలంగాణకు మద్దతు పలుకుతున్నాడని విమర్శించారు. సీమాంధ్రకు చెందిన ఆ పార్టీ నాయకులు రాష్ట్ర సమైక్యతకు కట్టుబడి ఉన్నట్లయితే ముందుగా చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేయాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్రను పక్కన పెట్టిన బాబు.. అధికార కాంగ్రెస్‌తో చెట్టాపెట్టాలేసుకు తిరగడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వారి చేతిలోని ఓటు అనే వజ్రాయుధంతో ఆయనతో పాటు పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు వారు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రజల తరఫున పోరాటం సాగిస్తున్న పార్టీ ఒక్క వైఎస్‌ఆర్‌సీపీయేనని.. అందుకే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజలు ఉద్యమం చేస్తుంటే.. కాంగ్రెస్, టీడీపీ నాయకులు హైదరాబాద్, ఢిల్లీ చుట్టూ తిరగడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీని వీడి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రామిరెడ్డిని సీమాంధ్రలోని ఆ పార్టీ నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దీక్షా శిబిరాన్ని కాటసాని సతీమణి జయమ్మతో పాటు కూతురు ప్రతిభ, అల్లుడు బ్రహ్మానందరెడ్డి తదితరులు సందర్శించారు.
 

>
మరిన్ని వార్తలు