వడ..దడ!

23 May, 2019 03:56 IST|Sakshi

నేటి నుంచి రాయలసీమ నిప్పుల కుంపటే

25 నుంచి కోస్తాంధ్రలోనూ ప్రతాపం

46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

భారత వాతావరణ విభాగం ప్రకటన

సాక్షి, విశాఖపట్నం: భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. రోజురోజుకూ తన ప్రతాపాన్ని తీవ్రతరం చేస్తున్నాడు. ఇప్పటికే కొద్దిరోజులుగా రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఆ ప్రాంతంలో వడగాడ్పులు హడలెత్తిస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో కోస్తాంధ్రలోనూ వడగాడ్పులు మొదలు కానున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్య మహారాష్ట్ర, విదర్భ, జార్ఖండ్‌ల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అటు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడుతున్నాయి. ఉత్తర కర్ణాటక నుంచి కేప్‌ కొమరిన్‌ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు గాని, వర్షంగాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది.

అదే సమయంలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో నిప్పుల కుంపటిని తలపించేలా వడగాడ్పులు వీస్తాయని.. అలాగే, కోస్తాంధ్రలో ఈనెల 25 నుంచి వడగాడ్పుల ప్రభావం మొదలవుతుందని పేర్కొంది. కోస్తాంధ్రలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వివరించింది. ఈ ప్రాంతాల్లో 46డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చునని తెలిపింది. జూన్‌ మొదటి వారం వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతూ వడగాడ్పులకు దోహదమవుతాయని వాతావరణ శాఖ రిటైర్డ్‌ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. కాగా, గడచిన 24 గంటల్లో నందికొట్కూరులో 3, ఆలూరు, నంద్యాల, డోర్నిపాడు, పాడేరుల్లో ఒక్కో సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు