చంద్రయాన్‌–2 విజయంలో తెనాలి తేజం!

23 Jul, 2019 10:54 IST|Sakshi
డాక్టర్‌ పావులూరి సుబ్బారావు

ప్రాజెక్టులో తెనాలి శాస్త్రవేత్త ముద్ర

ఏటీఎల్‌ సంస్థ ద్వారా కీలకమైన విడిభాగాల సరఫరా

ఇస్రో విజయాల్లో కీలకపాత్ర

తెనాలికి చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త, ఏటీఎల్‌ వ్యవస్థాపకుడు  సుబ్బారావు

సాక్షి, తెనాలి: భారత అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలు రాయిని ఇస్రో అందుకుంది. ఎంతో సంక్లిష్టమైన ప్రాజెక్టుగా పేరొందిన చంద్రయాన్‌–2ను సోమవారం విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష ప్రయోగాల్లో మనదేశ సత్తాను ప్రపంచానికి మరోసారి ఘనంగా చాటింది. 120 కోట్ల ప్రజల ఆకాంక్షలను, ఆశలను గగనానికి మోసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగ విజయంలో గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ పావులూరు సుబ్బారావు పాత్రకూడా ఉండడం మనందరం గర్వించదగిన విషయం. రాకెట్లకు కావాల్సిన కీలకమైన ఉపకరణాలను ఈయన సంస్థ సరఫరా చేస్తుండడం విశేషం..

తెనాలి వారే.. డాక్టర్‌ పావులూరి సుబ్బారావు స్వస్థలం తెనాలి సమీపంలోని గోవాడ గ్రామం. ఆయన 1952లో జన్మించారు. తండ్రి పావులూరి శివరామకృష్ణయ్య, తల్లి అమ్మెమ్మ. స్కూలు ఫైనల్‌ వరకు తెలుగు మీడియంలో చదివిన సుబ్బారావు స్వయంకృషితో రాణించారు. కాలికట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీఈ, బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో ఎంఈ చేశాక, బెంగళూరు యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. ‘ఇస్రో’లో శాస్త్రవేత్తగా చేరి, భారత అంతరిక్ష కార్యక్రమాల్లో నైపుణ్యం సాధించారు. మరింత సృజనాత్మకతతో రాణించాలన్న భావనతో ఉన్న ఆయనను అంతరిక్ష వ్యాపారం ఆకర్షించింది. ఫలితంగానే అనంత్‌ టెక్నాలజీస్‌ (1993) స్థాపనకు దారితీసింది.

రక్షణ, పరిశోధన (డీఆర్‌డీఓ)లో సిస్టమ్స్‌ డిజైన్, అభివృద్ధి చేసి, ఫ్యాబ్రికేషన్‌ చేసే వ్యాపారాన్ని అనంత్‌ టెక్నాలజీస్‌ చేపట్టింది. ఉపగ్రహ ప్రయోగ వాహకాలైన పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో, జాతీయ అభివృద్ధికి తోడ్పడే ఏరోస్పేస్‌ ప్రయోగాలన్నింటిలో విస్తృతంగా పాల్గొంది. అగ్ని, ఆకాశ్, బ్రహ్మోస్, పృథ్వి క్షిపణుల నిర్మాణం, తేలిక రకపు విమానాల తయారీలోనూ పాలుపంచుకున్నారు. చంద్రయాన్, మంగళయాన్‌ మిషన్స్‌లో శాటిలైట్‌ కాంపొనెంట్స్‌ నిర్మాణంలో పాల్గొని ‘మామ్‌’ శాటిలైట్‌ మెయిన్‌ఫ్రేమ్‌ మొత్తాన్ని అభివృద్ధి చేసినట్టు సుబ్బారావు చెప్పారు. 

ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) చేపట్టిన తొలి భారీ అంతరిక్ష ప్రాజెక్టు చంద్రయాన్‌ –1. పదేళ్ల క్రితం అతితక్కువ ఖర్చుతో చేసిన ఈ ప్రయోగంతో చంద్రుడిపై నీటి ఆనవాళ్లను పసిగట్టారు. మళ్లీ ఇప్పుడు చంద్రయాన్‌–2 విజయవంతంగా ప్రయోగించి దేశ కీర్తిప్రతిష్టలను ప్రపంచ యవనికపై ఇస్రో మరోసారి చాటింది . ‘చంద్రుడు ఆవాసంగా నివాసం...అవకాశాలు’ అనేది తాజా ప్రయోగం ముఖ్య ఉద్దేశం. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)నుంచి ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరొందిన జీఎస్‌ఎల్‌వీ మార్స్‌3–ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా జరిగిన ఈ ప్రయోగం విజయవంతంలో ఓ తెలుగుతేజం భాగస్వామ్యం ఉంది. ఆయనే తెనాలికి చెందిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్‌ పావులూరి సుబ్బారావు. 

కీలక ఉపకరణాలు సరఫరా:

ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసిన అనుభవంతో డాక్టర్‌ సుబ్బారావు స్థాపించిన ఏటీఎల్‌ స్పేస్‌ సిస్టమ్స్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ సంస్థ టెలిమెట్రీ, టెలికమాండ్, పవర్, ఆటిట్యూడ్, ఆర్బిట్‌ కంట్రోల్, ఆన్‌–బోర్డ్‌–కంప్యూటర్‌ వంటి ఎన్నో పరికరాలు ఇస్రోకు అందించింది. రాకెట్‌ ప్రయోగాల్లో వీటిని కీలకంగా చెబుతారు. ఈ సంస్థ తయారుచేసిన స్టార్‌ సెన్సార్‌ వంటి అత్యాధునికమైన స్పందన నమోదుచేసే ముఖ్యమైన పరికరాల్ని ఇస్రో తన శాటిలైట్లలో వినియోగిస్తోంది. వాటివల్ల స్పేస్‌ క్రాప్ట్‌–నక్షత్రాల మధ్య గల దూరాలను గుర్తించటానికి వీలవుతుందని, పరిశోధనల్లో ఇదెంతో కీలకమని డాక్టర్‌ సుబ్బారావు ‘సాక్షి’తో ఫోనులో చెప్పారు. ఇస్రో వాహకనౌకలకు కావాల్సిన ఏవియానిక్స్‌ సిస్టమ్స్‌ను కూడా ఏటీఎల్‌ అందిస్తోంది. నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్, ఆధునిక టెలిమెట్రీ, ఆర్‌ఎఫ్‌ సిస్టమ్స్, పవర్‌ మాడ్యూల్స్, డీసీ/డీసీ, ఇనెర్పియల్‌ సెన్సింగ్‌ యూనిట్, స్టేజీ హెర్నేసింగ్‌ అండ్‌ ఇంటెగ్రేషన్‌ వంటి వాటిని ఈ సంస్థ సమకూరుస్తున్నారు. 

సొంతంగా రాకెట్‌ ప్రయోగం
ఇస్రో ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ ప్రొడక్షన్‌ ధ్రువీకరించిన ఏటీఎల్‌లో 300 పైగా సుశిక్షితులైన నిపుణులు, ఇంజినీర్లు పనిచేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి అసెంబ్లింగ్‌ యూనిట్లతోపాటు పరీక్షించే సదుపాయం కూడా సంస్థలో ఉంది. ప్రస్తుతం నాలుగు టన్నుల శాటిలైట్ల నిర్మాణ ప్రారంభ దశ నుంచి పరీక్షకు సిద్ధంచేసే వరకు పూర్తి సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు డాక్టర్‌ సుబ్బారావు తెలిపారు. అత్యంత సృజనాత్మకమైన ఈ సదుపాయంతో ఇస్రోతో పాటు ఇతర దేశాలకూ శాటిలైట్లు తయారు చేసిస్తామని చెప్పారు. ఏటీఎల్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే ‘ఏ1 శాట్‌’ అనే సొంత శాటిలైట్‌ను రష్యా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించామని, ప్రస్తుతం అది దక్షిణ అమెరికాలో ఇంటర్నెట్‌ సేవలను అందిస్తున్నట్టు వివరించారు. 

25 ఏళ్లుగా భాగస్వామ్యం: ఆర్బిటర్, ల్యాండర్‌ వంటి బహుముఖ వ్యవస్థలు కలిగివున్న బాహుబలి (జీఎస్‌ఎల్‌వీ ఎంకే–3) ఉపగ్రహం, చంద్రయాన్‌–2 మిషన్‌ ప్రత్యేకత తెలిసిందే. ఇందులోని మూడు ముఖ్యమైన దశలకు చెందిన ఏవియానిక్స్‌ సిస్టమ్స్‌ను నిర్మించి ఇస్రోకు అందించినది హైదరాబాద్‌కు చెందిన అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (ఏటీఎల్‌) సంస్థ. ఎలక్ట్రానిక్‌  సిస్టమ్స్‌ను కూడా అందిస్తోందీ సంస్థ. ఏటీఎల్‌ వ్యవస్థాపకుడు, సీఎండీ తెనాలికి చెందిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్‌ పావులూరి సుబ్బారావు కావటం విశేషం. ఇస్రో విజయాల్లో 25 ఏళ్లుగా అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (ఏటీఎల్‌)కు భాగస్వామ్యముంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ, తన తిరువనంతపురం యూనిట్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీలకు ఏవియానిక్స్‌ సిస్టమ్స్‌ను అందిస్తోంది. కమ్యూనికేషన్స్, రిమోట్‌ సెన్సింగ్‌ నావిగేషనల్, సైంటిఫిక్‌ శాటిలైట్స్‌ లాంటి అన్ని రకాల ఉపగ్రహాల్లో ఎలక్ట్రానిక్‌ కక్ష ఉపవ్యవస్థల రియలైజేషన్, డెలివలీ విభాగాలను చాలాకాలంగా ఏటీఎల్‌ బెంగళూరు యూనిట్‌ నుంచి అందిస్తోంది. 
 

మరిన్ని వార్తలు