‘తూర్పు’లో టెన్షన్‌.. టెన్షన్‌

25 Jul, 2017 04:09 IST|Sakshi
‘తూర్పు’లో టెన్షన్‌.. టెన్షన్‌
ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరింపు
- ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోలీసుల ఆంక్షలు
పాదయాత్రను అడ్డుకుంటే మరో రోజు ప్రారంభిస్తానన్న ముద్రగడ
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు/నెట్‌వర్క్‌: ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కాపుల రిజర్వేషన్‌ కోసం ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి చేపట్టనున్న చలో అమరావతి పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో టెన్షన్‌  నెలకొంది. పాదయాత్రను అడ్డుకోవాలని ప్రభుత్వం.. పాదయాత్రను నిర్వహించడానికి ముద్రగడ, కాపునేతలు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉద్యమకారులను అడ్డుకోవడానికి ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. పాదయాత్ర జరిగే తూర్పుగోదావరి నుంచి గుంటూరు జిల్లా వరకూ ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కాపు నేతల కదలికలపై నిఘా పెట్టింది. 
 
కట్టడిలో కిర్లంపూడి..: ముద్రగడను ఇంటి నుంచే కదలనివ్వకూడదనే ఉద్దేశంతో పోలీసులు కిర్లంపూడిలోని ఆయన ఇంటిని అదుపులోకి తీసుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో అడుగుకో పోలీసు అన్నట్లుగా మోహరించారు. తూర్పుగోదా వరిలో సోమవారం నాటికే ఏడువేలకుపైగా పోలీసులను మోహరించారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, యాంటీ నక్సల్స్‌ స్క్వాడ్‌లు రంగంలోకి దించారు. కాపుల  ప్రాబల్యమున్న గ్రామాలను దిగ్బంధం చేస్తున్నారు. చెక్‌పోస్టులు, అవుట్‌ పోస్టులు, పికెట్‌లు ఏర్పాటు చేశారు. కీలకమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పెట్టడంతోపాటు డ్రోన్‌ కెమెరాల సాయంతో కాపుల కదలికలను తెలుసుకుంటున్నారు.  తాజాగా వైఎస్సార్‌సీపీ యువ నేత జక్కంపూడి గణేష్‌పై కూడా బైండోవర్‌ కేసు పెట్టారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావును సోమవారం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పోలీసులు అడ్డుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లోని గ్రామాలు, జాతీయ రహదారులపై సుమారు 95 పోలీస్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.  
 
అనుచరులతో ముద్రగడ చర్చలు..
తాజా పరిణామాలపై ముద్రగడ తన అనుచరులతో చర్చిస్తున్నారు. ఎవర్నీ రానివ్వకుండా అడ్డుకుంటే ఒక్కడ్నే నడిచివెళ్తానని, గాంధేయ మార్గంలో పాదయాత్ర చేస్తానని, ఒకవేళ అడ్డుకుంటే ఇంటిలోనే ఉండి, మరోరోజు పాదయాత్ర ప్రారంభిస్తానని, పాదయాత్ర చేపట్టక మాననని   వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
మరిన్ని వార్తలు