వైభవంగా పర్ణశాల రామయ్య తెప్పోత్సవం

11 Jan, 2014 02:33 IST|Sakshi
హంసవాహనంపై గోదావరిలో విహరిస్తున్న స్వామివారు

దుమ్ముగూడెం, న్యూస్‌లైన్: వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో శ్రీసీతారామచంద్రస్వామి వారికి వైభవంగా గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించారు. భద్రాచలంలో వైకుంఠ ముక్కోటి ఉత్సవాలను నిర్వహించే తరుణంలో పర్ణశాల లోనూ తెప్పోత్సవం నిర్వహించారు. సీతారామచంద్రస్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా మేళతాళాడు, బాణసంచా, భక్తుల సందడి మధ్య గ్రామ పురవీధుల మీదుగా గోదావరి ఒడ్డుకు తీసుకువచ్చారు. గోదావరి తీరంలో అప్పటికే సిద్ధంగా ఉన్న హంసవాహనంలో స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుత్ కాంతులతో ముచ్చటగొలిపే హంస వాహనంపై గోదావరిలో స్వామి వారిని మూడుసార్లు తిప్పారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన జయజయద్వానాలతో ఆ ప్రాంతం మార్మోగింది. గోదావరిలో విహరించిన స్వామి వారిని 6.30 నిమిషాల సమయంలో హంస వాహనం నుంచి స్నానఘట్టాల వరకు పల్లకిలో తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు.
 
 ఆలయ అర్చకులు ఎన్‌బీవీఎల్‌ఎన్ ఆచార్యులు, శ్యాసం కిరణ్‌కుమారాచార్యులు, కె విష్ణువర్ధనాచార్యులు, శ్రీమన్నారాయణాచార్యులు, కృష్ణమాచార్యులు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎస్సై సత్యనారాయణ సమక్షంలో స్పెషల్ పార్టీ, సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కలిసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ ఆశాలత, స్థానిక తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విశ్వనాథసుబ్రహ్మణ్యం, ఈఓఆర్డీ అల్లాడి నాగేశ్వరరావు, కార్యదర్శి నారాయణ, విద్యుత్ శాఖ, ఇరిగేషన్, వీఆర్వోలు, వైద్య, సాక్షరభారత్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు