ఇక ఇక్కడా... కృత్రిమ గుండె

30 Sep, 2014 00:11 IST|Sakshi
ఇక ఇక్కడా... కృత్రిమ గుండె

హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చిన కిమ్స్  పరికరం ఖరీదు రూ.60 లక్షలు
 
 హైదరాబాద్: గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం ఎదురు చూస్తున్న బాధితులకు శుభవార్త. ఇక నుంచి బ్రెయిన్‌డెడ్ బాధితుని నుంచి సేకరించే సహజమైన గుండె కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం కృత్రిమ గుండెను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఢిల్లీ, చెన్నైలో మాత్రమే ఈ తరహా వైద్యసేవలు అందుబాటులో ఉండగా, తాజాగా హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చింది. వైద్య పరిభాషలో హార్ట్‌వేర్ వెంట్రికులర్ అసిస్ట్ డివైజ్ (హెచ్‌వీఏడీ)గా చెప్పుకునే 160 గ్రాముల బరువున్న ఈ కృత్రిమ గుండెను ప్రపంచ హృద్రోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిమ్స్ యాజమాన్యం సోమవారం ఆస్పత్రిలో ఆవిష్కరించింది. గోల్ఫ్ బంతి సైజులో ఉన్న ఈ పరికరాన్ని రోగి ఛాతిలోపల ఉన్న గుండెకు కింది భాగంలో అమర్చుతారు. లెఫ్ట్ వెంట్రికల్ (ఎల్‌వీఏడీ) ఫెయిల్యూరైతే గుండె ఎడమ భాగానికి సపోర్టుగా, రైట్ వెంట్రికల్ (ఆర్‌వీఏడీ) పనిచేయకపోతే కుడి భాగానికి సపోర్టుగా, రెండు వెంట్రికల్స్ విఫలమైతే రెండి ంటికీ సపోర్టుగా దీన్ని అమర్చుతారు. టైటానియంతో తయారు చేసిన ఈ గుండె నిమిషానికి పది లీటర్ల రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. గుండె కింది భాగంలో అమర్చిన ఈ పరికరాన్ని ఛాతీ బయట ఉన్న బ్యాటరీ కంట్రోలర్‌కు అనుసంధానిస్తారు. చిన్న కేబుల్ ద్వారా ఇది ఆపరేట్ అవుతుంది. ఆరు గంటలకోసారి బ్యాటరీ మార్చుకోవాలి.

దీని ఖరీదు రూ.60 లక్షలు. శస్త్రచికిత్స, వైద్యుడి ఫీజు, ఆస్పత్రి ఖర్చు అన్నీ కలిపి రూ.80-90 లక్షలవుతుంది. కిమ్స్ ఎండీ, ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ, దేశంలో ఇప్పటి వరకు ఐదుగురు హృద్రోగులకు మాత్రమే ఈ పరికరాన్ని అమర్చారని, దీంతో వారి జీవితకాలం మెరుగుపడిందన్నారు. ప్రముఖ గుండెమార్పిడి నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ నందగిరి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ల మంది హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతుండగా, 7.25 మిలియన్ల మంది మరణిస్తున్నారని చెప్పారు. వీరికి గుండె మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే పరిష్కారమన్నారు. అవసరమైన సమయంలో సహజమైన గుండె దొరక్క రోగులు చనిపోతున్నారని, సహ జ గుండెకు ప్రత్యామ్నాయంగా ఈ పరికరాన్ని అమర్చి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు.
 
 
 

మరిన్ని వార్తలు