ప్రేమించకుంటే యాసిడ్ పోస్తా | Sakshi
Sakshi News home page

ప్రేమించకుంటే యాసిడ్ పోస్తా

Published Tue, Sep 30 2014 12:08 AM

ప్రేమించకుంటే యాసిడ్ పోస్తా - Sakshi

సాక్షి, గుంటూరు
 ఓ యువకుడు ప్రేమిస్తున్నానంటూ నాలుగేళ్లుగా ఓ విద్యార్థిని వెంట పడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తన వెంట పడవద్దని ఎన్నోసార్లు ఆ యువతి చేతులెత్తి వేడుకున్నా ఆ శాడిస్టు మనసు మాత్రం కరగలేదు. బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే రాజకీయ పలుకుబడితో కేసు నమోదు కాకుండా బైండోవర్‌తో బయటపడగలిగాడు. అప్పటి నుంచి వేధింపులు ఎక్కువకావడంతో భరించలేని బాధిత యువతి సోమవారం రూరల్ జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణను ఆశ్రయించింది. తన గోడు చెప్పుకుని కాపాడమని వేడుకుంది. వివరాలిలా ఉన్నాయి.. వినుకొండకు చెందిన ఓ యువతి నరసరావుపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతోంది. మొదటి సంవత్సరం నుంచి శావల్యాపురం మండలం పిచుకలపాలెం గ్రామానికి చెందిన బోడేపూడి నాగేశ్వరరావు అనే యువకుడు తనను ప్రేమించమంటూ వెంటపడి వేధించడం ప్రారంభించాడు. అనేకసార్లు తన జోలికి రావద్దని చెప్పినప్పటికీ వేధింపులు మానకపోవడంతో వినుకొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజకీయ పలుకుబడి ఉన్న నాగేశ్వరరావు పెద్దమనషుల సమక్షంలో పోలీసుస్టేషన్‌లో పంచాయితీ పెట్టి బైండోవర్ సంతకంతో బయటపడ్డాడు. నెలరోజులపాటు ఆమె వైపు రాకుండా ఉన్న నాగేశ్వరరావు ఆ తరువాత మళ్లీ వేధించడం ప్రారంభించాడు. కళాశాల వద్దకు వెళ్లి బహిరంగంగానే వేధిస్తుండడంతో తట్టుకోలేని బాధితురాలు ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతూ మధ్యలోనే ఆపివేసి ఇంటికే పరిమితమైంది. అయినా ఆగని నాగేశ్వరరావు ప్రతిరోజూ ఆమె ఇంటి వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ పోసి చంపుతానని అడ్డు వస్తే కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తానంటూ బెదిరించడం ప్రారంభించాడు. ఇక ఆ శాడిస్టు వేధింపులు భరించలేని బాధితురాలు రూరల్ ఎస్పీ రామకృష్ణను కలిసి తనను, తన కుటుంబాన్ని కాపాడాలంటూ భోరున విలపించింది. న్యాయం జరగకపోతే తమ కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని వాపోయింది.  బాధితురాలి గోడు విన్న ఎస్పీ స్పందించారు. యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశాలు జారీచేశారు.



 

Advertisement

తప్పక చదవండి

Advertisement