దేవాలయాల కూల్చివేత అమానుషం

6 Jul, 2016 00:34 IST|Sakshi

మచిలీపట్నం (చిలకలపూడి) : రహదారుల అభివృద్ధిలో భాగంగా విజయవాడలో 42 ఆలయాలను కూల్చివేయడం అమానుషమైన చర్య అని బీజేపీ బందరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పంతం గజేంద్ర అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా ధర్నా జరిగింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డౌన్.. డౌన్.. అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గజేంద్ర మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా దేవాలయాలు కూల్చివేయడమే కాకుండా బీజేపీ నాయకులపై తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడం సబబుకాదన్నారు. ఆలయాలు కూల్చివేయటంపై మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్సీ, ఎంపీలను పరుష పదజాలంతో దూషించడం హేయమన్నారు.


హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఆలయాలను విచక్షణారహితంగా కూల్చివేస్తున్నారని ఇందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. విజయవాడ మునిసిపల్ కమిషనర్ తదితర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ జిల్లా యువమోర్చ నాయకుడు చిలంకుర్తి పృధ్వీప్రసన్న మాట్లాడుతూ ఆలయాల కూల్చివేత విషయంలో బీజేపీ నాయకులపై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో సీహెచ్ రంగయ్యకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు కూనపరెడ్డి శ్రీనివాసరావు, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, ఉడత్తు శ్రీనివాసరావు, మల్లాది వెంకటేశ్వరరావు, కూనపరెడ్డి సుబ్బయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు