‘ప్రత్యేక’కు ఇక బై

23 May, 2014 00:38 IST|Sakshi

అమలాపురంటౌన్, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు చివరిక్షణాలు సమీపిస్తున్నాయి. మరో వారం పదిరోజుల్లో కొత్త కౌన్సిళ్లు కొలువుదీరనున్నాయి. మూడున్నరేళ్లుగా సాగిన ప్రత్యేకాధికారుల పాలన పట్టణవాసుల్లో తీవ్రఅసంతృప్తిని కలిగించింది. 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల తర్వాత జిల్లాలో ఏర్పడ్డ మున్సిపల్ పాలకవర్గాల కాలపరిమితి 2010 సెప్టెంబర్ 30తో ముగిసింది. అప్పటి నుంచి ఏదో ఒక సాకుతో ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రత్యేకాధికారుల పాలనను ఆరునెలలకోసారి పొడిగిస్తూ వచ్చింది. ఇలా మూడున్నరేళ్లలో ఏడు సార్లు పొడిగించింది. చివరకు కోర్టు జోక్యం చేసుకోవడంతో తప్పనిసరై ఎన్నికలను నిర్వహించింది.
 
 అందుబాటులో లేక...
మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదటి ఆరునెలలు సంతృప్తికరంగానే సాగింది. ఆ తర్వాత ప్రత్యేకాధికారులు పాలనపై శ్రద్ధ చూపలేకపోయారు. తమ సొంత శాఖ విధులతోనే తలమునకలయ్యే ఆ అధికారులు ప్రత్యేక పాలన విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేకపోయారు. వారు కేవలం ఫైళ్లపై సంతకాలకే పరిమితమయ్యారు. పట్టణాల్లో పేరుకుపోతున్న క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి సారించలేకపోయారు. మూడో ఏడాది వచ్చేసరికి ఫైళ్లపై సంతకాలకోసం ప్రత్యేకాధికారులు ఉన్న జిల్లా కేంద్రానికో... డివిజన్ కేంద్రానికో మున్సిపల్ సిబ్బంది తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మున్సిపల్ సిబ్బందికి ప్రజల సమస్యలపై జవాబుదారీతనం కరవైంది. అమలాపురం, రామచంద్రపురం, పిఠాపురం తదితర మున్సిపాలిటీల్లో వీధిలైట్లు, తాగునీరు, పారిశుధ్య సమస్యలు ఎక్కువయ్యాయి.
 
 గట్టెక్కనున్న సమస్యలు
మరో పది రోజుల్లో మున్సిపల్ కొత్త కౌన్సిళ్లు జిల్లాలో కొలువుదీరనున్నాయి. ప్రజలు తమ సమస్యలను స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరింపజేసుకోవచ్చు. కౌన్సిలర్లు కూడా తమ తమ వార్డుల్లో రోజూ పర్యటిస్తూ సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లో లేదా కౌన్సిల్‌లో చర్చించో వాటి పరిష్కారానికి చొరవ చూపుతారు. మున్సిపల్ సిబ్బంది కూడా కౌన్సిలర్లకు భయపడి అప్రమత్తంగా విధులను నిర్వహిస్తారు. ఉదాహరణకు జిల్లాలో ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లో పింఛన్లు నెలలో సగం రోజులు గడిచినా కూడా లబ్ధిదారులకు అందని పరిస్థితి ఉంది. ఇకపై సక్రమంగా పింఛన్లు అందే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు