రైతు యూనిట్‌గా పంటల బీమా

19 Feb, 2015 02:17 IST|Sakshi
రైతు యూనిట్‌గా పంటల బీమా
  • ఐసీఏఆర్ సమావేశంలో కేంద్రాన్ని కోరిన మంత్రి పోచారం
  • ఉద్యాన వర్సిటీకి కేంద్రం హామీ
  • వ్యవసాయానికి ‘ఉపాధి హామీ’
  •  సాక్షి, హైదరాబాద్: రైతును యూనిట్‌గా తీసుకుని పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఢిల్లీలో జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్) 86వ వార్షిక సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమావేశానికి ముందు ఉదయం మంత్రి నివాసంలో, అనంతరం కృషిభవ న్‌లో కేంద్ర వ్యవసాయశాఖమంత్రి రాధామోహన్‌సింగ్‌తో పోచారం రెండుసార్లు భేటీ అయ్యారు.

    కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హార్టికల్చర్ వర్సిటీ నిర్మాణం సహా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. రైతు యూనిట్‌గా పంటల బీమాను అమలు చేసేందుకు పార్లమెంటులో చట్టం తీసుకురావాలని, సర్వే నంబర్ల ఆధారంగా బీమా చె ల్లింపు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ సహాయం చేయాలని కోరాం.

    గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వ్యవసాయం నిర్వీర్యం కావడంతో రైతులు పట్టణ ప్రాంతాలకు వలస పోతున్నారని, వీరంతా తిరిగి గ్రామాలకు వచ్చేలా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశాను.’ అని తెలిపారు. రాష్ట్రానికి ఉద్యాన వర్సిటీని మంజూరు చేస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కోరినట్టు చెప్పారు. వ్యవసాయ, పాడిపరిశ్రమ, మత్స్యశాఖలు అమలు చేస్తున్న వివిధ పథకాలను సమావేశంలో పోచారం వివరించారు. ఎన్‌ఆర్‌ఈజీఏను వ్యవసాయానికి అనుసంధానిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని ప్రతిపాదించగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు పోచారం తెలిపారు.

>
మరిన్ని వార్తలు