తోటపల్లి కాలువ పనులను అడ్డుకున్న రైతులు

5 Feb, 2016 00:37 IST|Sakshi
తోటపల్లి కాలువ పనులను అడ్డుకున్న రైతులు

రణస్థలం/లావేరు:  రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా రణస్థలం, లావేరు మండలాల్లో అధికారులు చేపట్టిన తోటపల్లి కాలువ తవ్వకాలను  గురువారం అడ్డుకున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పక్వానికి వచ్చే పంటల్లో కాలువల తవ్వకంపై మండిపడ్డారు. రణస్థలం మండలంలోని రణస్థలం రెవెన్యూ, లావేరు మండలంలోని తాళ్లవలస రెవెన్యూ పరిధిల్లో పొక్లెయిన్లతో చేపట్టిన తవ్వకాలను రణస్థలం, రావివలస రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న లావేరు మండల తహశీల్దార్ పి.వేణుగోపాలరావు, ఎస్సై రామారావులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

శివారు భూములకు సాగునీరందించేందుకు చేపట్టే కాలువ తవ్వకాలకు సహకరించాలని కోరారు. దీనిపై పలువురు రైతులు మాట్లాడుతూ పంటలు పక్వానికి వచ్చే దశలో ఉన్నాయని, ఇప్పుడు వాటిని నాశనం చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. భూము లు ఏ మేరకు పోతున్నాయి, ఎంత నష్టపరిహారం అందజేస్తారన్నది తెలియజేయకుండా పనులు చేపట్టడాన్ని తప్పుబట్టారు. స్థానికంగా భూములు లేని టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన తప్పుడు నివేదికల ఆధారంగా పనులకు పూనుకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.అధికారులు నచ్చజెప్పినా రైతులు ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగారు. పక్కా సర్వే, పరి హారం లెక్క తేలాకే పనులు చేపట్టాలని రణస్థలం, తాళ్లవలస గ్రామాలకు చెందిన రైతులు పిన్నింటి అప్పలనాయడు, సత్యం, పి.పాపినాయుడు, కుప్పిలి అప్పారావు, నీలకంఠం, లక్ష్మణరావు తదితరులు కోరారు.
 
ఎకరాభూమి నష్టపోతున్నా...
రావివలస గ్రామంలో ఉన్న ఎకరా భూమి తోటపల్లి కాలువకు పోతోంది. ఇక్కడ భూమిని సాగుచేయడానికి బోరుకూడా వేశాను. ఇప్పుడు ఎకరాభూమితో పాటు బోరుకూడా నష్టపోతున్నాను. ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేస్తుందో తెలియజేసి కాలువల తవ్వకాలు జరపాలి     -పిన్నింటి సత్యనారాయణ, రైతు, రణస్థలం పంట చేతికొచ్చే సమయంలో...కాలువకు 40 సెంట్లు భూమి పోతోంది. ఇందులో ప్రస్తుతం మొక్కజొన్న సాగుచేస్తున్నా. పక్వానికి వచ్చింది. ఈ సమయంలో కాలువ తవ్వితే పెట్టుబడి అంతా మట్టిలో కలిసిపోతుంది. పరిహారం ఇచ్చాకే పనులు జరపాలి  -పిన్నింటి అప్పలనాయుడు, రైతు, రణస్థలం

మరిన్ని వార్తలు