సినీ ఫక్కీలో చోరీ

29 Jan, 2015 01:27 IST|Sakshi
సినీ ఫక్కీలో చోరీ

రాపూరు: ‘దొంగలు తిరుగుతున్నారు.. బంగారం దోచుకుంటారు.. ఇన్ని నగలు మెడలో ఉంచుకోకు.. చీర కొం గులో కట్టుకో..’ అని మాయమాటల తో నమ్మించి సుమారు ఐదు సవర్ల విలువైన బంగారు సరుడును ముగ్గురు మహిళలు చాకచక్యంగా దోచుకున్నారు. ఈ ఘటన రాపూరులో బుధవారం మిట్టమధ్యాహ్నం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. వెంకటగిరి తూర్పువీధికి చెందిన గడ్డం రత్నమ్మ (60) రాపూరు కొత్తపేటలో జరిగే బంధువుల ఉత్తరక్రియలకు వచ్చింది. ఆమె బస్సు దిగి వస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని మహిళలు ఆమె తో మాటలు కలిపారు.

తాము ఊరికి కొత్తని, మంచి టవల్ కొనుగోలు చేసి ఇవ్వాలని నమ్మబలకడంతో రత్నమ్మ రాపూరు పాత బస్టాండులోని వస్త్ర దుకాణానికి తీసికెళ్లి రూ.30 విలువైన టవల్ కొనుగోలు చేసి ఆ మహిళలకు ఇచ్చింది. షాపు నుంచి బయటకు వస్తుండగా ఇక్కడ ఒక పర్సు పడి ఉందని తనతోపాటు వచ్చిన ఒక మహిళ దానిని తీసుకొని ఇందులో రూ.5,500 ఉన్నాయని, వీటిని ముగ్గురం సమానంగా పంచుకుందామని చెప్పి జనసంచారం లేని స్థానిక చర్చి రోడ్డు వద్దకు వెళ్లారు.

ఈ క్రమంలో రాపూరులో దొంగలు ఉన్నారు ఇంత బంగా రు మెడలో వేసుకొని తిరిగితే వారు దోచుకుంటారని ఇద్దరు మహిళలు రత్నమ్మకు చెప్పారు. రత్నమ్మ తన మెడలోని సరుడును తీసి పర్సులో దాచుకుంటుండగా పర్సులో ఎందుకు చీర కొంగులో కట్టుకొని ఇంటికి వెళ్లి వేసుకోమని వారే సరుడును తీసి చీర కొంగులో కట్టి అది ఊడకుండా వైరుతో గట్టిగా చుట్టారు.
 
పవిట చెంగులో గులకరాళ్లు..
ఇంతలో ఒక మహిళ వచ్చి తన పర్సు వస్త్ర దుకాణం వద్ద పడిపోయిందని, అది మీకు దొరికిందని అక్కడి వారు చెప్పారని, ఇస్తారా.. పోలీసులకు చెప్పమంటారా అని గద్దిస్తూ మహిళల వద్ద ఉన్న పర్సును లాక్కుని వాదనకు ది గింది. తనతో ఉన్న మహిళలు ఆమెతో గొడవ పడుతూ తనను వెళ్లమని అ త్యంత చాకచక్యంగా జారుకున్నారని, తను అక్కడి నుంచి కొంత దూరం వెళ్లి తన చెంగుకు ఉన్న ముడిని తీసిచూడగా అందులో గులకరాళ్లు ఉన్నాయ ని, తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశానని ఏడుస్తూ చెప్పింది.

సరుడు నాలుగు సవర్లు ఉంటుందని  సరుడులో రెండు కాసు లు, నాలుగు గుండ్లు, మంగళసూత్రం ఉన్నాయని, ఇవి సుమారు ఐదు సవర్ల వరకు ఉంటుందని తెలిపింది. తన వద్దకు వచ్చిన మహిళలు ముగ్గురు ఒకే ముఠాకు చెంది ఉంటారని అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే ఎస్‌ఐ కర్రిముల్లా,తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ, నిందితులు దొరకలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. గత సెప్టెం బర్ నాలుగున రాపూరు మండలం వెలుగోనుకు చెందిన యశోదరమ్మ కూడా ఇలాగే మూడు సవర్ల బంగారు సరుడును పోగొట్టుకొని మోస పోయింది.

మరిన్ని వార్తలు