తొలి సంతకంలోనే మాట తప్పిన చంద్రబాబు

9 Jun, 2014 00:40 IST|Sakshi

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజం
 
రైతుల రుణాలు మాఫీ చేయాలిగానీ కమిటీ ఎందుకు?
ఇది రైతులను నిలువునా మోసం చేయడమే


 హైదరాబాద్: రైతుల రుణాలను మాఫీ చేస్తూ తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట తప్పారని, ప్రజలకు అబద్ధాలు చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కోఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ విమర్శించారు. రైతుల రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన బాబు.. ఆ పని చేయకుండా విధివిధానాలంటూ కమిటీ వేయడంలోని ఔచిత్యమేంటని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రుణాలు మాఫీ అయి ఖరీఫ్ సీజన్‌లో కొత్తగా పంట రుణాలకోసం రైతులు ఎదురుచూస్తుంటే ఇలాంటి కుంటిసాకులు ఎందుకు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

రుణాల మాఫీపై తొలి సంతకం అంటే కమిటీ నియామకంపై సంతకమా? అని ప్రశ్నిస్తూ.. ఇది రైతులను నిలువునా మోసం చేయడమేనని దుయ్యబట్టారు. ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజునే, తొలి సంతకంతోనే చంద్రబాబు నిజస్వరూపం బయట పడిందని, ఆయన్ను ప్రజలు నమ్మబోరని ప్రసాద్ అన్నారు. అధికారంలో ఉన్నపుడు ఒకమాట, లేనపుడు ఇంకొక మాట మాట్లాడే చంద్రబాబు తన నైజాన్ని మళ్లీ చాటుకున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో బంగారం తాకట్టుతోసహా అన్ని రకాల రుణాలు రద్దు చేస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబు తన ప్రసంగంలో ఆ ఊసే ఎత్తలేదని ఆయన తప్పుపట్టారు.    
 
 

>
మరిన్ని వార్తలు