మైనార్టీల అభ్యున్నతే లక్ష్యం : పెద్దిరెడ్డి

15 Feb, 2015 02:26 IST|Sakshi

రొంపిచెర్లలో ఇస్తిమా ఏర్పాట్ల పరిశీలన
 
రొంపిచెర్ల: మైనార్టీల అభ్యున్నతే తన లక్ష్యమని వైఎస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శనివారం రొంపిచెర్లలో జరుగుతున్న ఇస్తిమా ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో జెడ్పీ చెర్మన్ వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థిగా రొంపిచెర్లకు చెందిన నీలుఫర్‌ను ఎంపిక చేశామన్నారు. అయితే తమ పార్టీ అభ్యర్థి తక్కువ సీట్ల తేడాతో ఓడి పోయిందన్నారు. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ పదవిని మైనార్టీలకే ఇచ్చామన్నారు. కల్లూరు, రొంపిచెర్ల పంచాయతీల్లో సర్పంచ్‌లుగా మైనార్టీ మహిళలను గెలిపించామన్నారు. తన గెలుపునకు మైనార్టీలు కృషి చేశారని తెలిపారు. ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేను మత పెద్దలు కోరారు. ఇస్తిమా జరగనున్న 15,16 తేదీల్లో 24 గంటలు విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు.

అలాగే ఇతర ప్రాంతాల నుంచి ముస్లింలు వచ్చేందుకు అనువుగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులను ఏర్పాటు చేయిస్తామన్నారు. ఇస్తిమా ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ నాయకులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం బజారువీధిలోని వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణశెట్టి, రాధాకృష్ణయ్యశెట్టి ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు.   వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టెలికం బోర్డు సభ్యుడు షఫీ, పీలేరు జెడ్పీటీసీ సభ్యులు రెడ్డిబాషా, సలీంబాషా,  ఇబ్రహీంఖాన్, కరీముల్లా, మహ్మద్‌బాషా, అల్ల్లాబక్ష్, రాజా, సూర్యనారాయణరెడ్డి,  కోట వెంకటరమణ, రెడ్డిమోహన్‌రెడ్డి, హరినాథ్, ప్రభాకర్‌రెడ్డి, చంద్ర, బాలకృష్టారెడ్డి  పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు