కండలేరుకు ‘చంద్ర’గ్రహణం

7 Jul, 2014 02:31 IST|Sakshi
కండలేరుకు ‘చంద్ర’గ్రహణం
 •  మంచినీటి పథకం రద్దుకు ప్రభుత్వ నిర్ణయం !
 •  మాజీ సీఎం కిరణ్ జీవో ఇస్తే...దాన్ని రద్దుచేసే యోచనలో సీఎం చంద్రబాబు
 •  నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో చిత్తూరు జిల్లా వాసులకు తాగునీటి ఇక్కట్లు
 •  కండలేరును రద్దు చేస్తామని ఇటీవల ప్రకటించిన ఎంపీ సీఎం రమేష్
 • సాక్షి, చిత్తూరు: కొన్నేళ్లుగా మంచినీటి సమస్యతో చిత్తూరు జిల్లా ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. వీరి సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెల్సిందే. చిత్తూరు ప్రజలకు తాగునీళ్లు అందించేందుకు దాదాపు పాలకులంతా నిర్లిప్తత ప్రదర్శించారు. 2004లో సీఎంగా అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి గాలేరు-నగరి, హంద్రీ-నీవా ద్వారా కృష్ణాజలాలను జిల్లాకు రప్పించి సాగు, తాగునీటినందిం చేందుకు శ్రీకారం చుట్టారు. ఆయన హఠాన్మరణంతో ఆ పథకం ఆగిపోయింది. తర్వాత ముఖ్యమంత్రి పీఠమెక్కిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కండలేరు నీటిని జిల్లాకు రప్పించి సాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఉపక్రమించారు.
   
  రూ.7,430 కోట్లతో మంచినీటి పథకం

  సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2012లో కండ లేరు మంచినీటి పథకాన్ని మంజూరు చేసింది. 2012లో జీవో ఎంఎస్ నంబర్ 27, 29, 12/2012 ను జారీచేసింది. 6టీఎంసీలను జిల్లాకు రప్పించేం దుకు 7,430 కోట్ల రూపాయలతో ఈ భారీ మంచి నీటి ప్రాజెక్టును చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు విదేశీ నిధుల సాయంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నుంచి పైపులైన్ ద్వారా నీటిని పంపింగ్ చేసి తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు, 10 వేలకుపైగా కుగ్రామాలకు మంచినీరు అందించడం ఈ పథకం లక్ష్యం. తొలి విడతలో భాగంగా రూ.5,900 కోట్లతో టెండర్లు ఆహ్వానించారు. దాదాపు 176 కిలోమీటర్లు ప్రధాన పైపులైన్ నిర్మించి, లింకులైన్ ఏర్పాటు చేసే నీటిని సరఫరా చేసేందుకు డిజైన్ రూపొందించారు. గతేడాది జిల్లా పర్యటనకు వచ్చిన కిరణ్ ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని జిల్లావాసులంతా ఆశగా ఎదురుచూశారు.
   
  బాబు రాకతో...కండలేరుకు మంగళం
   
  కండలేరు ప్రాజెక్టు పూర్తయితే ఈ పేరు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి దక్కుతుంది. ఆ కారణంతోనే ఈ ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ఎంపీ సీఎం రమేష్ కండలేరు ప్రాజెక్టును ఆపేస్తామని స్పష్టం చేశారు. ఆ స్థానంలో ఎన్టీఆర్ సుజలస్రవంతి ద్వారా మంచినీరు అందిస్తామన్నారు.

  బాబుగారి మాట రమేష్ నోట వచ్చిందని జిల్లాలో జోరుగా చర్చసాగుతోంది. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా 20 లీటర్ల మినరల్ వాటర్‌ను 2 రూపాయలకే ఇస్తామని టీడీపీ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అయితే కేవలం దీంతోనే మంచినీటి సమస్య తీరదు. కనీస అవసరాలకు మంచినీరు అవసరం. ఈ క్రమంలో కండలేరు మంచినీటి పథకం పూర్తయితేనే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
   
  తాగునీటికి అల్లాడుతున్న జనాలు

  ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలు మంచినీటికోసం అల్లాడిపోతున్నారు. చిత్తూరు కార్పొరేషన్‌లో ప్రతి ఇంటికీ మంచినీటి సంప్ నిర్మాణం అనివార్యమైంది. ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేయడం, సంప్‌లో నింపుకోవడం అలవాటుగా మారిపోయింది. తిరుపతి, మదనపల్లెతో పాటు దాదాపు అన్ని మునిసిపాలిటీలు, మండలాల ప్రజలు మంచినీటి సమస్యతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టును పూర్తి చేసి, జిల్లా వాసుల దాహార్తిని శాశ్వతంగా తీర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు.
   
  ‘‘తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, 10 వేలకుపైగా గ్రామాలకు శాశ్వతంగా మంచి నీటిని అందిస్తాం.. అందుకే కండలేరు మంచినీటి పథకానికి అనుమతులు ఇచ్చాం. మొదటి విడత రూ.5,900 కోట్లతో టెండర్లు పిలిచాం. ఇది పూర్తయితే చిత్తూరు జిల్లాకు భవిష్యత్‌లో తాగునీటి సమస్య రాదు.’’
   - 2013లో అప్పటి సీఎం,  కిరణ్‌కుమార్‌రెడ్డి
   
   ‘‘కండలేరు ప్రాజెక్టుకు నిధులు లేవు. కేవలం టెండర్లు పిలిచారు. హడ్కో నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. 150 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. దాన్ని ఎన్నికల సమయంలో ఎందుకు ఇచ్చారో అందరికీ తెలుసు. కండలేరు ప్రాజెక్టును ఆపేస్తాం. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీరు అందిస్తాం.’’
   -ఇటీవల చిత్తూరు పర్యటనలో ఎంపీ సీఎం రమేష్
   

మరిన్ని వార్తలు