సంగీత పేల్చిన ‘గన్’..!

12 May, 2016 03:30 IST|Sakshi
సంగీత పేల్చిన ‘గన్’..!

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో
ఆలిండియా తుపాకీ లెసైన్సులు
బుల్లెట్ సురేష్‌కు రూ.7 లక్షలకు పిస్టల్ విక్రయం
పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో సంగీత స్పష్టీకరణ
బుల్లెట్‌పై కేసు నమోదుకు రంగం సిద్ధం

 
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అంతర్జాతీయ మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో ఆమె చెప్పిన వివరాల మేరకు పోలీసులు చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్‌పై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

 చిత్తూరు (అర్బన్):  ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మన్ జైలులో ఉండగా సంగీత అన్నీ తానై వ్యాపారాన్ని యథేచ్ఛగా నడిపింది. అంతేగాక స్మగ్లర్లకు రూ.10 కోట్లు పంపిణీ చేసింది. ఈ క్రమంలో చిత్తూరు పోలీసులు పశ్చిమబెంగాల్‌లో సంగీతను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను ట్రాన్సిట్ వారెంట్‌పై చిత్తూరుకు తీసుకురావాలనుకున్నారు. కోల్‌కతాలో స్థానిక పరిస్థితులు అనుకూలిం చలేదు. దీంతో ఆమె అరెస్టును అక్కడే చూపించి ఒక రోజు జైలు ఉంచి తర్వాత బెయిల్‌పై విడుదల చేసిన విషయం తెలిసిందే. సంగీత చటర్జీని అరెస్టు చేసిన సమయంలో ఆమె నుంచి పోలీసులు కన్‌ఫెక్షన్ స్టేట్‌మెంట్ (నేర అంగీకార పత్రం)ను తీసుకున్నారు. ఇందులో అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం, తప్పుడు గన్‌లెసైన్సుల వివరాలు బయటపడ్డాయి.


 నలుగురి వద్ద లెసైన్సులు
 ఎర్రచందనం స్మగ్లింగులో అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగిన లక్ష్మణ్ రెండో భార్య సంగీత ఇచ్చిన సమాచారంతో చిత్తూరు పోలీసులు దర్యాప్తును లోతుగా చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తుపాకులు విచ్చలవిడిగా దొరుకుతాయి. వీటికి గన్‌లెసైన్సులు పొందడానికి లక్ష్మణ్, సంగీత చటర్జీ, సెల్వరాజ్, బుల్లెట్ సురేష్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్టు విచారణలో తేలింది. వాటితో గన్‌లెసైన్సు తీసుకున్నట్లు గుర్తించారు. ఈ నలుగురు ఎర్రచందనం స్మగ్లింగులో అరెస్టయిన వాళ్లే. చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్ నాగాలాండ్‌లోని తిమ్మాపూర్‌లో నివాశముంటున్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపించి గన్‌లెసైన్సు తీసుకున్నాడని, ఇతను లక్ష్మన్ నుంచి రూ.7 లక్షలు వెచ్చించి ‘కామా’ పిస్టల్‌ను కొనుగోలు చేశాడని సంగీత చటర్జీ పోలీసులకు చెప్పింది. అక్కడి పోలీసు స్టేషన్లలో ఎలాంటి కేసులు లేవని ఎన్‌వోసీ తీసుకుని ఆలిండియా గన్‌లెసైన్సు పొందినట్లు పేర్కొంది.

నాగాలాండ్ గన్‌లెసైన్సు ఉన్నప్పటికీ పిస్టోలు తనతోపాటు ఉంచుకోవాలంటే తప్పనిసరిగా స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) అనుమతి ఉండాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. బుల్లెట్ సురేష్‌కు అలాంటి అనుమతి లేదని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు అతనిపై అక్రమ ఆయుధాల నిరోధక చట్టం, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించినందుకు మరో కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో నిందితుడిగా ఉంటూ ఇటీవల బెయిల్‌పై వచ్చిన బుల్లెట్ సురేష్‌కు సంగీత చటర్జీ కొత్త కేసుల్ని తెచ్చిపెట్టింది.

మరిన్ని వార్తలు