సర్కారు ‘మందు’ చూపు!

19 Jun, 2017 01:23 IST|Sakshi
సర్కారు ‘మందు’ చూపు!
అధికారం కోల్పోయినా మరో మూడేళ్లు బార్ల వ్యాపారం కొనసాగేలా వ్యూహం
- ఏడాదికే పరిమితమైన లైసెన్స్‌ను ఐదేళ్లకు పెంచుతూ నిర్ణయం
- ఈ లెక్కన బార్‌ లైసెన్సుల రెన్యూవల్‌కు ఓ మంత్రి భారీగా వసూళ్లు
- రూ.332.8 కోట్లు దండుకోవడానికి మంత్రాంగం
- కొత్తగా 85 బార్లకు అనుమతి.. జూలై 1 నుంచి నూతన బార్ల విధానం 
 
సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం ఒకెత్తయితే బాబు సర్కారు ఇంకో అడుగు ముందుకేసి అధికారం పోయాక కూడా మద్యం వ్యాపారాల్లో మునిగితేలేలా నూతన బార్ల విధానం తీసుకు వచ్చింది. సాధారణంగా ఏడాదికోసారి బార్ల లైసెన్స్‌ల ను రెన్యువల్‌ చేస్తారు. ప్రస్తుతం ఇదే విధానం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాటు బార్ల లైసెన్స్‌లను మంజూరు చేసేందుకు వీలుగా నూతన బార్ల విధానాన్ని తీసుకువచ్చింది. అంటే రెండేళ్ల తర్వాత అధికారం కోల్పోయినా సరే, మరో మూడేళ్ల పాటు బార్ల లైసెన్స్‌లు కొనసాగాల న్నదే వ్యూహం.

గతంలో ఉన్న బార్‌ లైసెన్స్‌లు గత ప్రభుత్వానికి చెందిన వారివనే సాకుతో మొత్తం లైసెన్స్‌లను రద్దు చేస్తూ.. తమ వారికి ఇచ్చుకునేందుకు వీలుగా ఎవరు ముందు దరఖాస్తు చేస్తే వారికే లెసెన్స్‌లంటూ తీసు కొచ్చిన విధానాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీం తో మద్యం వ్యాపారం లేదా వ్యాపారుల ద్వారా భారీగా దండుకోడానికి వ్యూహం రూ పొందించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్స్‌దారుల నుంచే భారీగా ముడుపులు పొందేందుకు వీలుగా నూతన బార్ల విధానాన్ని తెరపైకి తెచ్చింది. సాధారణంగా ఏడాది లేదా రెండేళ్లకు బార్ల లైసెన్స్‌లను మంజూరు చేయాలి. అలాంటిది ఐదేళ్లకు లైసెన్స్‌లను మంజూరు చేసే విధానం తీసుకువచ్చింది. రెండేళ్లకు లైసెన్స్‌ మంజూరు చేస్తే సరిపోతుందని అధికారులు ప్రతిపాదిం చినా వినకుండా, ప్రభుత్వపెద్దలు ఐదేళ్లకు లైసెన్స్‌ మంజూరు చేయాలని నిర్ణయం తీసు కున్నారు.

ఈ మేరకు ఈ నెల 15న క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదించారు. ఇందుకు అను గుణంగా ఒక మంత్రి ప్రస్తుత బార్‌ లైసెన్స్‌ దారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తు న్నారు. ఒక్కో బార్‌ లైసెన్స్‌దారు నుంచి రూ.40 లక్షల చొప్పున వసూళ్ల పర్వం ప్రారంభించారు. మధ్యవర్తిత్వం లేకుం డా నేరుగా తననే సంప్రదిం చాలనే సంకేతా లను ఆ మంత్రి పంపు తున్నారని  ఎక్సైజ్‌  వర్గాలే పేర్కొంటున్నాయి. ఈ లెక్కన కొత్తగా మంజూరయ్యే బార్ల తో సహా సర్కారు పెద్దలు రూ.332.8 కోట్లు దండుకో నున్నారని స్పష్టమవుతోంది. ఐదేళ్లకు లైసెన్స్‌ మంజూరు చేస్తున్నందున వ్యాపారంలో స్థిరత్వం నెలకొంటుందని ప్రభు త్వం ఈ విధానాన్ని సమర్థించు కోజూస్తోంది. 
 
ప్రస్తుత బార్‌ లైసెన్స్‌దారులందరూ అర్హులే:  ప్రస్తుత బార్ల లైసెన్స్‌ల కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. వచ్చే నెల 1 నుంచి నూతన బార్ల లైసెన్స్‌ విధానం అమ ల్లోకి వస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న ప్రస్తుత బార్‌ లైసెన్సుదారులందరూ కొత్తగా లైసెన్స్‌ పొందేందుకు అర్హులేనని నూతన బార్ల విధానంలో పేర్కొన్నారు. ఒక బార్‌ లైసెన్స్‌ కోసం ఒకటికన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో లైసెన్స్‌ మంజూరు చేస్తారు. ఆన్‌లైన్‌లో బార్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మంచినీరు దొరక్కపోయినా బార్‌లు మాత్రం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తీసు కొచ్చిన నూతన బార్ల విధానంపై ఎక్సైజ్‌ శాఖ వర్గాలే విస్తుపోతున్నాయి. మామూళ్ల కోసం ఇంత బరితెగింపా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 747 బార్లుండగా, కొత్తగా 85 బార్లకు లైసెన్స్‌లు మంజూరు చేయాలని నిర్ణయించింది. 30 వేల జనాభాకొక బార్‌ చొప్పున ఏర్పాటు చేయనున్నారు.

ఇదిలా ఉండగా జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే బార్లు ఏర్పాటు చేయరాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యం చెప్పింది. జాతీయ రహదారులకు 500 మీటర్లలోపు, రాష్ట్ర రహదారులకు 220 మీటర్లలోపు బార్లను అనుమతించరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే సుప్రీం ఆదేశాలను పాటిస్తే బార్ల సంఖ్య సగం తగ్గిపోనున్న నేపథ్యంలో రాష్ట్ర రహదారులను జిల్లాల్లో జిల్లా ప్రధాన రహదారులగా పేరు మార్చుతూ బార్ల లైసెన్స్‌లను మంజూరు చేయాలని నిర్ణయించింది. 
 
లైసెన్సు ఫీజు తగ్గింపు స్థానంలో  అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ
బార్‌ లైసెన్స్‌ ఫీజుపై సర్వీసు పన్ను చెల్లించాల్సి ఉన్నందున, ఆ పన్ను మొత్తం కేంద్రానికే వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్‌ ఫీజును తగ్గించింది. తద్వారా తగ్గిన ఆదాయాన్ని అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ పేరుతో రాబట్టుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం 50 వేల జనాభా లోపు గల బార్‌ల లైసెన్స్‌ ఫీజు రూ.25 లక్షలుండగా రూ.15 లక్షలకు తగ్గించారు. 5 లక్షలలోపు జనాభా గల ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.40 లక్షలుండగా రూ.30 లక్షలకు తగ్గించారు. 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.50 లక్షలుండగా రూ.40 లక్షలకు తగ్గించారు. 
మరిన్ని వార్తలు