ఐటీలో ఉద్యోగం కోల్పోయినా మళ్లీ ఉపాధి | Sakshi
Sakshi News home page

ఐటీలో ఉద్యోగం కోల్పోయినా మళ్లీ ఉపాధి

Published Mon, Jun 19 2017 1:13 AM

ఐటీలో ఉద్యోగం కోల్పోయినా మళ్లీ ఉపాధి - Sakshi

ముంబై: ఐటీలో భారీగా ఉద్యోగాలు గల్లంతవుతాయన్న ఆందోళన నెలకొనగా... ఏం ఫర్వాలేదు వారిలో సగం మందికి వేరే అవకాశాలు తలుపుతట్టనున్నాయంటూ ఓ సర్వే పేర్కొంది. వచ్చే రెండేళ్లలో 2 లక్షల మంది ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోవచ్చని అంచనా వేస్తుండగా... వీరిలో సగం మంది తిరిగి కొత్త నైపుణ్యాలపై శిక్షణ ద్వారా ఇతర అవకాశాలు అందిపుచ్చుకుంటారని తెలిపింది. సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ అనే సంస్థ 50 ఐటీ సంస్థల్లోని మధ్య స్థాయి నుంచి సీనియర్‌ స్థాయి నిపుణులను ప్రశ్నించి మరీ ఈ విషయాలను వెల్లడించింది. ‘‘ఐటీ పరిశ్రమలో ఉద్యోగుల తొలగింపు (అట్రిషన్‌) రేటు 15–20 శాతంగా ఉంది.

 దీనికితోడు ఆటోమేషన్‌ కారణంగా వచ్చే రెండేళ్లలో 2 లక్షల ఐటీ ఉద్యోగాలు కనుమరుగు కానున్నాయి. ఇది ఆందోళన కలిగించేదే. కానీ వీరిలో అందరూ ఉద్యోగాలు కోల్పోయినట్టు కాదు. వారికి తగినన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి’’ అని సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ సీఈవో ఆదిత్య నారాయణ్‌ మిశ్రా తెలిపారు. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సపోర్ట్, టెస్టింగ్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో ఎక్కువ ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని ఆయన తెలిపారు.

అదే సమయంలో క్లౌడ్‌ కంప్యూటింగ్, ఆర్టిఫీషియెల్‌ ఇంటెలిజెన్స్‌ తదితర విభాగాలు కొత్త అవకాశాలు  కల్పిస్తాయన్నారు. ‘‘తొలగింపు ఇప్పటికే మొదలైంది. పరిశ్రమలోని 50 శాతం మంది, ఎనిమిదేళ్లలోపు అనుభవం ఉన్న ఫ్రెషర్లకూ కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై శిక్షణ ఇచ్చి వేరే చోటకు బదిలీ చేయనున్నారు’’ అని మిశ్రా వివరించారు. మిగిలిన సగం మంది పరిస్థితే కష్టమని, వారు రిటైల్, కన్జ్యూమర్‌ బ్యాంకింగ్‌ వంటి ఇతర రంగాల్లో అవకాశాలను వెతుక్కోవాల్సిందేనని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement