ఆర్థిక మాంద్యం లేదు 

11 Dec, 2019 05:51 IST|Sakshi

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసనమండలిలో మంత్రి బుగ్గన వెల్లడి 

అన్ని రాష్ట్రాల్లో మాదిరే మన రాష్ట్రంలోనూ ఆదాయం తగ్గుదల

సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మాదిరే మన రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఆదాయం కొంత మేర తగ్గింది తప్పితే, ఆర్థిక మాంద్యం (రెసిషన్‌) వంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జరిగిన చర్చలో మంత్రి జవాబిచ్చారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాదిలో కేవలం 8 శాతం మాత్రమే ప్రభుత్వ ఆదాయం తగ్గిందని తెలిపారు.  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగని కారణంగా కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు నిలిచిపోయాయని, ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రెవెన్యూ లోటు రూపంలో కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులు తక్కువగా ఉండడం వంటి కారణాలతో ఆదాయం తగ్గిందని చెప్పారు.

నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం విషయంలో మాత్రం గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఆ కాలానికి కేవలం నాలుగు శాతం మాత్రమే తగ్గుదల కనిపిస్తోందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం తమ ప్రభుత్వానికి దాదాపు రూ. 60 వేల కోట్ల బిల్లుల బకాయిలు పెట్టిపోయిందని చెప్పారు. ఈ ఆరు నెలల్లో తమ ప్రభుత్వం రూ. 20 వేల కోట్ల బకాయిలు చెల్లించిందని చెప్పారు. రాష్ట్ర   కాగా, తమ సూచనలు వినాలని నాలెల్జ్‌ తెచ్చుకోవాలని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బుగ్గన మండిపడ్డారు. నియోజకవర్గం అభివృద్ధి పనుల గురించి అప్పటి విపక్ష సభ్యులు అప్పటి సీఎంను కలిస్తే, తమ పార్టీ వాళ్లు కాదని, నిధులు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారని తెలిపారు.  

రంగులపై మీరా విమర్శించేది?: పెద్దిరెడ్డి 
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్మశానం గోడలకూ ఆ పార్టీ రంగులు వేయించిందని.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు సచివాలయ భవనాల రంగులపై తమ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్టు జాతీయ జెండాకు ఎక్కడా వైఎస్సార్‌సీపీ రంగు వేయలేదని వివరించారు. సర్పంచుల ఆధ్వర్యంలోనే గ్రామ సచివాలయాలు పనిచేస్తాయని, సచివాలయ భవనాలలోనూ సర్పంచికి ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసినట్టు వివరించారు.  

మార్చిలోగా ఇమామ్‌లకు ఇళ్ల స్థలాలు: అంజాద్‌ బాషా 
అర్హత గల ఇమామ్‌లు, మౌజన్‌లకు వచ్చే ఏడాది మార్చిలోగా ఇళ్ల స్థలాలను కేటాయించి, రిజిస్టర్‌ చేయిస్తామని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా శాసనమండలిలో చెప్పారు. రాష్ట్రంలో సుమారు 9,000 మంది ఇమామ్‌లు, మౌజన్‌లు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర రాజధానిలో కొత్తగా హజ్‌ హౌస్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం రెండు మూడు స్థలాలు పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా