వారు గిరిజనులు కాదట

13 Jul, 2015 03:22 IST|Sakshi
వారు గిరిజనులు కాదట

- థింసా కళాకారులు బీసీలట
- అనాదిగా అన్యాయం..
- ప్రయోజనాలన్నింటికీ దూరం
 
వారి జీవనశైలి, ఆచారం, ఆవాసం, కట్టుబొట్టూ, కట్టుబాట్లూ, సంస్కృతి, సంప్రదాయాలన్నీ అచ్చు గిరిజనులవే. మన్యంలోనే జీవనం. గిరిజన ఉత్సవాలకైనా, వేడుకలకైనా, ప్రారంభోత్సవాలకైనా అధికారులు ఏరికోరి వారినే తీసుకొస్తారు. ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి, ప్రధాని, రాష్ట్రపతి వరకూ ఎవరొచ్చినా వారితోనే థింసా నృత్యం చేయిస్తారు. మా గిరిజన సంస్కృతి ఎంత గొప్పదో అంటూ చాటుకుంటారు. ఆ అతిరథులు కూడా ఆహా! ఓహో!! అంటూ మురిసిపోతారు. కానీ.. వారు మాత్రం గిరిజనులు కాదంటోంది ప్రభుత్వం. బీసీలుగానే పరిగణిస్తోంది. ఆశ్చర్యంగాను, వింతగాను అనిపిస్తున్నా ఇది నమ్మలేని నిజం. విశాఖ మన్యంలోనే ఉంటున్న కొండకుమ్మర్లు వెనకబడిన తరగతుల వారంటూ తేల్చేయడంతో గిరిజనులకు లభించే ఒక్క పథకానికి కూడా నోచుకోవడం లేదు.

సాక్షి, విశాఖపట్నం :
ఏజెన్సీలో కొండకుమ్మర్లు అనాదిగా జీవనం సాగిస్తున్నారు. వీరిలో చాలామందిది కుండల తయారీ వృత్తి. దీంతో అప్పుడెప్పుడో వీరిని వెనకబడిన తరగతుల జాబితాలో చేర్చారు. ఎస్టీల్లో తమను చేర్చకపోవడంపై ఆందోళన చెందారు. అప్పట్లో అల్పసంఖ్యలో ఉండడం వల్ల వీరి ఆవేదనను అంతగా పట్టించుకున్న వారు లేరు. కాలక్రమంలో వారి సంఖ్య సుమారు 40 వేలకు చేరింది.

మన్యం వ్యాప్తంగా వీరు నివాసం ఉంటున్నా హుకుంపేట, పాడేరు, జి.మాడుగుల, కొయ్యూరు, చింతపల్లి తదితర మండలాల్లో అధికంగా ఉన్నారు. వీరికి గిరిజనుల మాదిరిగానే గిరిజన ఆవాసాల్లో భూములు, ఇళ్లు ఉన్నాయి. ఈ సంగతి కింద నుంచి పై స్థాయి వరకు అధికారులకు, ప్రజాప్రతినిధులకూ తెలుసు. కానీ ఎస్టీ జాబితాలో చేర్చడానికి వృత్తి అడ్డమొచ్చిందన్న సాకుతో ఇన్నాళ్లూ వీరికి అన్యాయం జరుగుతూ వస్తోంది. తమలాగే జీవిస్తున్న సాటి గిరిజనులు ఎస్టీలకు ప్రభుత్వం తరఫున దక్కే అన్ని పథకాలు, ప్రయోజనాలు, విద్య, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. కానీ వీరు మాత్రం వాటికి నోచుకోకుండా అన్యాయమై పోతున్నారు.
 
ప్రాతినిథ్యం లేక..  
వీరు తమ వాదనను వినిపించడానికి స్థానిక సంస్థల్లో వీరికి తగిన ప్రాతినిథ్యం లేదు. పోరాటానికి తగినంత సంఖ్యాబలమూ లేదు. ‘మీకు అన్యాయం జరుగుతోంది..’ అని సానుభూతి చూపించే వారే తప్ప వారి పక్షాన గొంతెత్తి ఆందోళనకు దిగేవారూ లేరు. ఏదైతేనేం? గిరిజన కొండకుమ్మర్లు ఇప్పటికీ బీసీలుగానే చలామణి అవుతున్నారు.
ఏంచేయాలి? : విశాఖ మన్యంలోని కొండకుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలంటే అసెంబ్లీలో తీర్మానం జరగాలి. దానిని పార్లమెంటుకు పంపాలి. అక్కడ అది ఆమోదం పొందాలి. ఇదంతా జరగాలంటే అధికారంలో ఉన్న వారికి చిత్తశుద్ధి ఉండాలి.

కొండకుమ్మర్లను పీటీజీల్లో చేర్చాలి...
ఆది నుంచి విశాఖ మన్యంలో ఉంటున్న కొండకుమ్మర్లను గిరిజనులుగా గుర్తించి,  వారిని పీటీజీ(ఆదివాసీ గిరిజన తెగ)లో చేర్చాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలి. ఇన్నేళ్ళు ఎస్టీలుగా గుర్తింపునకు నోచుకోక వీరికి ఎంతో అన్యాయం జరిగింది. కడు పేదరికం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో జీవనం సాగిస్తున్న వీరు గిరిజనులే.
- గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే, పాడేరు

మరిన్ని వార్తలు