దొంగ దొరికాడు..

20 Jul, 2019 08:40 IST|Sakshi
ఉండ్రాజవరం పోలీస్‌స్టేషన్‌లో పలు దొంగతనాలు చేసిన ముద్దాయితో  ఎస్సైలు అవినాష్, శ్రీనివాసరావు 

సాక్షి, పశ్చిమ గోదావరి(ఉండ్రాజవరం): దొంగతనాల్లో ఆరితేరిన పాత నేరస్తుడిని తణుకు, ఉండ్రాజవరం ఎస్సైలు కలిసి ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఉండ్రాజవరం ఎస్సై అవినాష్, తణుకు రూరల్‌ ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన పులవర్తి లీలాసాయి గుప్త ఇటీవల తణుకు మండలం వెంకట్రాయపురంలో రామేశ్వరపు సురేష్‌ ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి 10 కాసుల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. దీనిపై తణుకు సీఐ చైతన్యకృష్ణ ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్సైలు కలిసి కేసు విచారణ చేపట్టారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పాలంగిలో ఉన్నాడని సమాచారం తెలియటంతో వీరిద్దరూ కలిసి దాడిచేసి ముద్దాయిని గురువారం మధ్యాహ్నం పట్టుకున్నారు.

దీంతో అదుపులోకి తీసుకున్న లీలాగుప్తాని విచారించగా ఇటీవల ఉండ్రాజవరం మండలం సావరం, పాలంగి గ్రామాల్లో కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు ముద్దాయి ఒప్పుకున్నాడని చెప్పారు. ఆ దొంగతనాల్లో 10 కాసులతో పాటు రెండు కాసుల బంగారం, రెండు వెండిగిన్నెలు, వెండి పట్టీలు, ఒక ఫొన్, రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముద్దాయి గతంలో పలు నేరాలు చేసి జైలుశిక్ష అనుభవించినా మార్పు రాలేదని అందుకే తరచూ దొంగతనాలు చేస్తున్నాడని తెలిపారు. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ఉండ్రాజవరం, తణుక రూరల్‌ ఎస్సైలను, కేసులో సహకరించిన క్రైమ్‌ పార్టీ శ్రీధర్, పోలయ్యకాపు, సత్యనారాయణ, అక్బర్, మహేష్, వెలగేష్‌లను తణుకు సీఐ చైతన్య కృష్ణ అభినందించారు.

మరిన్ని వార్తలు