‘ఘాట్‌’ గా స్పందనేదీ..?

11 Dec, 2019 08:50 IST|Sakshi
శేషాచలం అడవిలో అన్నమయ్యకాలిబాట

అన్నమయ్య తిరుమలకు నడిచిన కాలిబాటకు వెయ్యేళ్లకు పైగా చరిత్ర

భక్తులందరూ అన్నమయ్య కాలిబాటలో తిరుమలకు

కొండకు తగ్గనున్న 45 కిలోమీటర్ల దూరం

సాక్షి, రాజంపేట: అదిగో అల్లదిగో అంటూ శ్రీవారిని స్మరిస్తూ .. వేడుకొంటూ అత్యంతభక్తితో రాజంపేట మండలంలోని తాళ్లపాక వాసి పదకవితా పితామహడు అన్నమాచార్యులు ఏడుకొండలను ఎక్కిన కాలిబాట ఇది. మూడవ ఘాట్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన  దశాబ్దాలుగా తెరపైకి వచ్చినా నాటి ప్రభుత్వాలు, టీటీడీ అధికారులు  స్పందించలేదు.  దీంతో ఈ బాట అభివృద్ధి అటకెక్కింది.  శ్రీ వేంకటేశ్వరస్వామిపై 32వేల సంకీర్తనార్చనలు చేసిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లిన మార్గాన్ని అభివృద్ధి చేసే విషయాన్ని  విస్మరిస్తూ వస్తున్నాయి. దశాబ్దాలుగా ఈ దారిలో తిరుమలకు నడిచి వెళుతున్న భక్తుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది.  

మార్గం తీరు ఇలా..
కడప–రేణిగుంట జాతీయర రహదారిలో కుక్కలదొడ్డి నుంచి తుంబరతీర్థం మీదుగా తిరుమలకు అన్నమయ్య నడిచి వెళ్లిన మార్గంలో కొండకు వెళ్లేందుకు మూడురోజులు పడుతుంది. కుక్కలదొడి సమీపంలోని మామండూరు మీదుగా అటవీ మార్గం నుంచి అన్నమయ్య నడిచి వెళ్లిన మార్గంలో కొంచెం అటు ఇటుగా తిరుమలకు చేరుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులుతిరుమలకు చేరుకుంటున్నారు. ఒక్క రాజంపేట ప్రాంతంలో నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి రాయలసీమ, తెలంగాణ, కోస్తా జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు ఈ మార్గం అనుకూలం. కొండపైన అన్నమయ్య పార్వేట మండపం వద్ద పాపవినాశనం రోడ్డులో దగ్గరలో ఈ దారి కలుస్తుంది.

కాలిబాటలో పాడుబడిన సత్రం 

శేషాచలం అటవీ ప్రాంతంలో.. 
అన్నమయ్య కాలిబాట పూర్తిగా శేషాచలం అటవీ ప్రాంతంలో సాగుతుంది. ప్రకృతి రమణీయ, కమనీయ దృశ్యాలు ఎన్నో కనిపిస్తాయి. ఈ మార్గంలో రోడ్డు వేస్తే తిరుమలకు చేరుకునే భక్తులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారులున్నాయి. అన్నమయ్య కాలిబాటను అభివృద్ధిచేస్తే తిరుమలకు రానుపోను 44 నుంచి 48 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇప్పుడున్న మార్గం ద్వారా 51కిలోమీటర్ల దూరం పడుతోంది. అదే మామండూరు నుంచి తిరుమల మార్గంలో అయితే 23 కిలోమీటర్లే అవుతుంది.  

దశాబ్ధాలుగా అతీగతీలేదు
అన్నమయ్య కాలిబాట మార్గం అభివృద్ధిని పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కుక్కల దొడి లేదా మామండూరు నుంచి తిరుమలకుమార్గం వేస్తే తిరుపతి ప్రాధాన్యత తగ్గుతుందన్న ఆందోళన చిత్తూరు జిల్లా వాసుల్లో నెలకొంది. తిరుమల దగ్గర అంశాన్ని అటవీ సంరక్షణ పేరుతో అడ్డుకుంటున్నటులగా ఆరోపణలున్నాయి. అందువల్లే అన్నమయ్య కాలిబాట అభివృద్ధి విషయంలోపూర్తి నిర్లక్ష్యవైఖరి కనిపిస్తోంది.
కాలిబాట స్వరూపం

  • మామండూరు–బాలపల్లె మధ్య స్వామి పాదాలు నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది. పక్షుల కిలకిలలు, సెలయేళ్లు, ఆహ్లాదకరమైన వాతవరణంతో పూర్వం భక్తులు కాలిబాట కొండకు చేరుకుంటుంది. 
  • అవ్వతాతగుట్టలు, శుక్రవారం బండలు, పురాతన సత్రాలు, ఎర్రిగుంటల, ఈతకాయల మండపం నుంచి గోగర్భతీర్థం (తిరుమల)చేరుకుంటుంది.
  • సుమారు ఈ కాలిబాట 14 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉంది. 
  • పాదాలు, అక్కడి కోనేరు, సత్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి.

17వ సారి ఆకేపాటి తిరుమల మహాపాదయాత్ర
వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తిరుమల మహాపాదయాత్రను 17వ సారి చేపట్టనున్నారు. ఈనెల 13న శుక్రవారం వేలాది మందితో తిరుమల పాదయాత్ర ప్రారంభించనున్నారు. అదేరోజున ఆకేపాడు లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు. కంకణధారణ, హోమం, భజనలు, అన్నదాన కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించనున్నారు. ఆకేపాడు ఆలయాల సముదాయం నుంచి మధ్యాహ్నం 2గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నేషనల్‌హైవే మీదుగా రాజంపేట, రైల్వేకోడూరుకు చేరుకొని అక్కడి నుంచి అటవీమార్గం(మామండూరు)లో తిరుమల చేరుతుంది.

గోవిందమాలలు ధరంచి తిరుమలకు కాలిబాటన వెళుతున్న భక్తులు(ఫైల్‌)

అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలి
అన్నమయ్య నడిచివెళ్లి శ్రీవారిని దర్శించుకున్న కాలిబాటను పునరుద్ధరించాలని భక్తులతోపాటు తాను దశాబ్దాలుగా కోరుతూనే ఉన్నాం. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో ఈ కాలిబాట అభివృద్ధికి బీజం పడింది. అయితే ఆయన మరణాంతరం కాలిబాట అభివృద్ధి అంశం అటకెక్కింది. 17వసారి పాదయాత్రగా ఈ మార్గం గుండా తిరుమల వెళుతున్నాను. భక్తులు పాల్గొని పాదయాత్రను జయప్రదంచేయాలి.  – ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాజంపేట

అన్నమయ్య బాటలో వెళ్లడం మహాభాగ్యం
పదకవితా పితామహడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్లిన కాలిబాటలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం. ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తే మూడవ ఘాట్‌గా ఉపయోగపడుతుంది. తెలంగాణ, సీమవాసులకు దగ్గరగా ఉంటుంది. ఈ మార్గం అభివృద్ధిపై ఆకేపాటితో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. – మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు డైరెక్టర్‌

అటవీప్రాంతం: శేషాచలం
తొలినడక:అన్నమాచార్యుడు
చరిత్ర: వెయ్యేళ్లు
దూరం: 23 కిలోమీటర్లు
కాలిబాట ప్రారంభం: మామండూరు–బాలపల్లె మధ్య

 

మరిన్ని వార్తలు