ముచ్చటగా మూడో‘సారీ’

7 Jun, 2018 10:37 IST|Sakshi

స్టీల్‌ప్లాంట్‌లో జేటీ పరీక్ష మళ్లీ రద్దు

దిగజారిన ఉక్కు ప్రతిష్ట

ఆందోళనలో అభ్యర్థులు 

సాక్షి, విశాఖపట్నం : జూనియర్‌ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం స్టీల్‌ప్లాంట్‌ గత నెలలో నిర్వహించిన పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు యాజమాన్యం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఏడాదిలో మూడు సార్లు పరీక్షలను రద్దు చేసి అప్రతిష్టను మూటగట్టుకుంది. స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం గతేడాది జూన్‌లో 645 జూనియర్‌ ట్రైనీ, 91 ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జూనియర్‌ ట్రైనీ పోస్టులకు సుమారు 78 వేల మంది, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సుమారు 56 వేల మంది దరఖాస్తు చేశారు. వీటికి సంబందించి గతేడాది జూలైలో రాత పరీక్షకు సిద్ధం కాగా.. ప్రశ్నపత్రాలు సకాలంలో చేరకపోవడంతో పరీక్షలను రద్దు చేశారు. దీంతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పరీక్షను పక్కన పెట్టి జూనియర్‌ ట్రైనీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి సన్నద్ధమయ్యారు. అయితే నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో అఖరు నిమిషంలో ఆ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. న్యాయస్థానం అనుమతి తీసుకుని ఎట్టకేలకు గత నెల 9 నుంచి 14 వరకు రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సుమారు 40 వేల మంది మాత్రమే హాజరయ్యారు. అయితే ఈసారి జరిగిన ఆన్‌లైన్‌ పరీక్ష పత్రంలో 2016, 2017లలో జరిగిన ఎస్‌ఎస్‌సీ జేఈ పరీక్ష పత్రాలను మక్కిమక్కీగా దించేశారు. దీనిపై అభ్యర్థులు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టడంతో యాజమాన్యం ఇద్దరు ఈడీలతో కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా రద్దుకు సిఫార్సు చేసింది. దీంతో యాజమాన్యం గత్యంతరం లేక ఈ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాదిలో మూడు సార్లు ఒక పరీక్షను రద్దు చేసిన ఘనతను మూటగట్టుకుంది. 


లోపించిన పర్యవేక్షణ
స్టీల్‌ప్లాంట్‌ నియామకాల ప్రక్రియలో వరుసగా జరుగుతున్న తప్పిదాలను గమనిస్తే అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపిక చేసిన ఏజెన్సీ చరిత్ర తెలుసుకోకుండా పరీక్షల నిర్వహిణను అప్పగించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా తరచూ పరీక్షలను రద్దు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడడం తగదని పలువురు సూచిస్తున్నారు.


అభ్యర్థులకు ఇబ్బందులు
ప్రభుత్వ రంగ సంస్ధలో ఉద్యోగంపై ఆశతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్ధులు అనేక ఇబ్బందులు పడి ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. చాలా మందికి షెల్టర్‌ లేకపోవడంతో బస్టాండ్, రైల్వే ఫ్లాట్‌ఫారాల పైన పడుకుని మరునాడు పరీక్షలకు హాజరయ్యేవారు. దీంతో వసతి, భోజనం వంటి వాటి కోసం వేలాది రూపాయలు వ్యయం చేయాల్సి వచ్చింది. ఇలా ప్రతిసారీ రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు