నీటి తరలింపునకు బ్రేక్

2 Jun, 2016 01:49 IST|Sakshi

యల్లయ్య కాలువ  నీటిని స్టీల్‌ప్లాంట్‌కు తరలించే యత్నం
అడ్డుకున్న రైతు సంఘాలు నీరు తరలిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక
చివరకు వెనుతిరిగిన అధికారులు

 

అనకాపల్లి: శారదానది నుంచి స్టీల్‌ప్లాంట్‌కు అడ్డగోలుగా నీటిని తరలించే ప్రక్రియను అనకాపల్లికి చెందిన రైతులు, ప్రజాసంఘాల సభ్యులు అడ్డుకున్నారు. అనకాపల్లి పట్టణ సరిహద్దులోని శారదానదికి ఆనుకొని ఉన్న యల్లయ్య, ఏలేరు కాల్వల కూడలి వద్ద జరుగుతున్న నీటిమళ్లింపును నిరసిస్తూ  బుధవారం  పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు.  రాత్రికి రాత్రి  యల్లయ్యకాల్వకు నీరు పారే మార్గాన్ని మట్టితో కప్పివేసి ఆ నీటిని ఏలేరు కాల్వలోకి మళ్లించడంతో స్థానిక రైతులు ఆందోళనతో అఖిలపక్ష నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దాడి వీరభద్రరావుతో పాటు వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ తదితర పార్టీల నాయకులు, వ్యవసాయదార్లసంఘం, నీటిసంఘం, రైతుసంఘం ప్రతినిధులు నీటి మళ్లింపు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండుగంటల వరకు అక్కడే ఉండి నీటిమళ్లింపు ప్రక్రియను నిలుపుచేయించారు.


అప్రమత్తమైన రైతులు
స్టీల్‌ప్లాంట్ నీటి అవసరాల కోసం  యల్లయ్య కాలువ నీటిని ఏలేరు కాలువలోకి మళ్లించే పనిని ప్లెసిబో అనే ప్రైవేట్ ఇంజినీరింగ్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు.   కొద్దిరోజుల నుంచి ఏలేరు కాలువకు ఆనుకొని రహదారులు, ఇంజిన్లు   ఏర్పాటు చేస్తున్నారు. యల్లయ్యకాలువ నీటిని ఏలేరు కాల్వలోకి మళ్లిస్తున్నారని తెలుసుకున్న  రైతులు అప్రమత్తమై   కాలువ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా  దాడి వీరభద్రరావు, రైతులు నీటిపారుదలశాఖ, స్టీల్‌ప్లాంట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శారదానీటిని స్టీల్‌ప్లాంట్‌కు తరలించడం తగదన్నారు. అయితే  తమకు అనుమతి ఉందని చెప్పేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ రైతులు వినకుండా  అక్కడే కూర్చున్నారు.  యల్లయ్య కాలువకు నీరు వెళ్లే మార్గాన్ని మూసివేసి ఏలేరు కాలువలోకి నీటిని మళ్లించడం పట్ల రైతుసంఘాలు, ప్రజాసంఘాలప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధుడెన నీటిపారుదలశాఖ ఎస్‌ఈ వల్లే ఈ దుస్థితి ఏర్పిడిందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు సైతం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.  పరిస్థితి తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ లీలారావు  తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని  నీటిపారుదలశాఖ, జీవీఎంసీ, స్టీల్‌ప్లాంట్ అధికారులతో చర్చలు జరిపారు. యల్లయ్యకాలువ నీటిని స్టీల్‌ప్లాంట్‌కు తరలించేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ తాము అంగీకరించబోమని రైతులు భీష్మించుకొని కూర్చోవడంతో అధికారులు వెనుతిరిగారు.

 
స్టీల్‌ప్లాంట్  జీఎంపై ఆగ్రహం

చర్చలు పూర్తయిన తర్వాత యంత్రాలను తొలగించే అంశంలో స్టీల్‌ప్లాంట్ నీటి  నిర్వహణ విభాగ జీఎం రామానుజం చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు,  అఖిలపక్ష నేతలు, రైతుసంఘాల సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు  స్టీల్‌ప్లాంట్ నీటి నిర్వహణ జీఎం రామానుజం, వాటర్‌మేనేజ్‌మెంట్ మేనేజర్ శివరామకృష్ణ  వెనుతిరిగారు. అక్కడ పరిస్థితిపై జీవీఎంసీ ఎస్‌ఈ ఆనందరావు, అడ్వయిజర్ జగన్మోహనరావు, నీటిపారుదలశాఖ ఏఈ తమ్మినాయుడులు కొద్దిసేపు చర్చించారు. ఈ ఆందోళనలో రైతుసంఘాల ప్రతినిధులు విల్లూరి పైడారావు, విల్లూరి రాము, కర్రి బలరాం, కర్రి మోదునాయుడు, కొణతాల శ్రీను, వైఎస్‌ఆర్ సీపీ  నేతలు సూరిశెట్టి రమణఅప్పారావు, ఆడారి సూరి అప్పారావు, జాజుల రమేష్, ప్రజారాజకీయ ఐక్యవేదిక నాయకుడు కనిశెట్టి సురేష్‌బాబు, బీజేపీ నేత గంగుపాం నాగేశ్వరరావు, వ్యవసాయదార్లసంఘం నాయకులు భీశెట్టి కృష్ణ అప్పారావు, సీపీఎం నాయకుడు ఎ.బాలకృష్ణ, సీపీఐ నాయకుడు వై.ఎన్.భద్రం తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు