తీరం చేరని సంక్షేమం

21 Nov, 2015 00:06 IST|Sakshi
తీరం చేరని సంక్షేమం

కడలిని నమ్ముకున్న వారికి కన్నీళ్ల్లు
ఎన్నాళ్లైనా ఆటుపోట్ల జీవితమే
నేడు మత్స్యకార దినోత్సవం

 
సముద్రాన్నే నమ్ముకున్నారు. వారి జీవితమంతా నీటిలోనే. కష్టం వచ్చినా..సుఖం వచ్చినా...అన్నీ ఆ గంగమ్మతల్లే వారికి. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాల స్పందన కంటితుడుపునకేపరిమితం. మత్స్యవేట తప్ప మరో ఆధారం లేని కడలిపుత్రుల సంక్షేమం నీటి మీద రాతలా మారిపో యింది. వారు నడిపే పడవలాగే వారి జీవితాలు కూడా ఆటుపోట్లతో సహజీవనం చేస్తున్నాయి.
 
డాబాగార్డెన్స్ : రాష్ట్రంలో ఉన్న తొమ్మిది కోస్తా జిల్లాల్లో సుమారుగా 60 లక్షల పైబడి మత్స్యకారులు సముద్రతీరాన్ని నమ్ముకున్నారు. ఎన్నికల ముందు మత్స్యకార ఓట్ల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు కావడం లేదనే ఆవేదన వారి నుంచి వినిపిస్తోంది. అంతేగాక సముద్రానే నమ్ముకున్న మత్స్యకారులను అభివృద్ధి పేరిట తీరం నుంచి దూరం చేస్తూ జీవనోపాధికి దెబ్బతీస్తున్నారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. విశాఖజిల్లాలో 139 కిలోమీటర్ల తీరప్రాంతంలో 64 మత్స్యకార గ్రామాలున్నాయి. లక్షా 50 వేల పైబడి మత్స్యకారులు ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో తొమ్మిది కోస్తా జిల్లాల్లో భవిష్యత్ అభివృద్ధి పేరిట వేల కోట్లలో అనేక పారిశ్రామిక, పర్యాటక పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదిస్తున్నారు. వీటి కోసం సముద్ర తీర ప్రాంతంతో పాటు పెద్ద ఎత్తున వ్యవసాయ భూములను భూసేకరణ చేపట్టడం జరుగుతోంది. దీంతో సంప్రదాయ మత్స్యకారులు, మత్స్యకార్మికులు, మహిళా కార్మికులు, రైతులు, దళితులు, యునాదిలు, చేతివృత్తి చేసుకుంటున్న వారందరి జీవనోపాధికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి.

 హుద్ హుద్..మిగిల్చిన వేదన
 హుద్‌హుద్ తుపాన్...ప్రధానంగా మత్స్యకారులకే తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుపాను బీభత్సానికి విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం గ్రామం నుంచి రాంబిల్లి మండలం వాడపాలెం వరకు 6429 ఇళ్లు కూలిపోయాయి. 185 ఇళ్లు పూర్తిగా సముద్రంలోకి కొట్టుకుపోయాయి. తుపాన్ బాధిత కుటుంబాలకు పలువురు దాతలిచ్చిన రూ.250 కోట్లు, ప్రభుత్వం రూ.250 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.60 కోట్లు కలుపుకొని మొత్తంగా రూ.560 కోట్లతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 10 వేల గృహాలు నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళిక తయారు చేయగా అందులో విశాఖ జిల్లాకు కేటాయించింది 6వేలు. ఇది కూడా కేవలం కాగితాలకే పరిమితమైంది. ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక గానీ, భూసేకరణ జరగలేదు. మరపడవలు, ఫైబర్ బోట్లు కలిసి మత్స్యశాఖ నష్టపరిహారం రూ.206 కోట్లు అంచనా వెయ్యగా కేవలం రూ.17 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పటికీ నష్టపోయిన లబ్ధిదారులకు కేవలం రూ.తొమ్మిది కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. చేపలు విక్రయించే మహిళలకు రూ.10వేలు ప్రభుత్వం ప్రకటించింది. అదీ కూడా ఫిషింగ్ హార్బర్‌లో ఉన్న వారికే.

 జీవనోపాధికి సవాలు...
 విశాఖ -కాకినాడ పెట్రోలియం కెమికల్, పెట్రో కెమికల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్(వీకేపీసీపీఐఆర్) ఏర్పాటుతో విశాఖ జిల్లా పెదగంట్యాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా వాకలపూడి గ్రామం వరకు 10 మండలాల్లో ఉన్న 97 గ్రామాలను కలుపుకొంటూ 640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 10 మండలాల్లో ఉన్న 55 మత్స్యకార గ్రామాల్లో ఉన్న ప్రజల జీవనోపాధి ప్రశ్నార్థకం కానుంది. విశాఖ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట తీరప్రాంతాన్ని ఆనుకుని కొత్త పోర్టుల ఏర్పాటు, రహదారుల విస్తరణ, పెట్రో పరిశ్రమల ఏర్పాటును ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల స్థానిక ప్రజలకు ఎంత వరకు లాభం? ఎంత వరకు నష్టం? అనే అంశాలు ఎక్కడా చెప్పలేదు. ఇప్పటికే కాలుష్యం కారణంగా మత్స్యవేటకు నష్టం వాటిల్లుతుండగా, మరిన్ని పరిశ్రమల రాకతో సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
ఇవీ డిమాండ్లు..
2014 సాధారణ సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 60 లక్షల పైబడి ఉన్న మత్స్యకారుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను పూర్తిగా అమలు చెయ్యాలి..హుద్‌హుద్ తుపాన్‌లో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు వెంటనే పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందివ్వాలి. రాష్ట్రంలో బీసీ-ఏలో ఉన్న మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. లేదా పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎంబీసీ రిజర్వేషన్ కల్పించాలి.తీరప్రాంతం, సముద్రంపై సమగ్రమైన హక్కుచట్టం కల్పించాలి. తీరప్రాంతం, సముద్ర సంప్రదాయ మత్స్యకారుల చట్టం-2009(రక్షణ హక్కు చట్టం) ముసాయిదా బిల్లును చట్టంగా చెయ్యాలి.
     
మత్స్యకార మహిళలకు చేపల బజార్లలో చేపలు విక్రయించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మత్స్యకార మహిళలకు ప్రభుత్వం గుర్తింపు కార్డులివ్వాలి.     తీరప్రాంత క్రమబద్దీకరణ మండలి(సీఆర్‌జెడ్)-2011 ముసాయిదాను చట్టం రూపంలోకి తీసుకురావాలి. ఎంఆర్‌ఎఫ్ చట్టం -1994ను పటిష్టంగా అమలు చెయ్యాలి.  చేపల వేట నిషేధ కాలంలో పొరుగు రాష్ట్రాల్లో వలే బియ్యానికి బదులుగా 60 రోజులకు దినసరి కార్మిక వేతనం ప్రకారం రూ.12 వేలు నగదు ఇవ్వాలి.   మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి.
 
ఎస్టీ జాబితాలో చేర్చేందుకు దశాబ్ధాల పోరాటం..

రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్పించాలంటూ ఐదు దశాబ్ధాలుగా పోరాటాలు చేస్తున్నా ఇప్పటికీ సాధ్యపడలేదు. పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎంబీసీ రిజర్వేషన్ కూడా కల్పించడం లేదు. ప్రతిసారి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులను ఎస్టీ జాబితాలోకి చేర్చుతామని వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల మాట మరిచారు.
 
 
హామీలే తప్ప..పరిష్కార మార్గాలేవి?
ఎన్నో ప్రభుత్వాలు చూశాం. ఎందరో ప్రజాప్రతినిధులనూ చూశాం. ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఒక్క వాగ్దానాన్నైనా నెరవేర్చారా అంటే ప్రశ్నార్థకమే. తీరప్రాంతం, సముద్ర సంప్రదాయ మత్స్యకారుల చట్టం-2009 (రక్షణ హక్కు చట్టం) ముసాయిదా బిల్లును చట్టంగా చెయ్యాలి.  చేపల వేట నిషేధ కాలంలో పక్క రాష్ట్రాల మాదిరిగా బియ్యానికి బదులు 60 రోజులకు దినసరి కార్మిక వేతనం ప్రకారం రూ.12 వేలు నగదు ఇవ్వాలి.
 - తెడ్డు శంకర్, కార్యదర్శి, కోస్తా మత్స్యకార సంక్షేమ సంఘం
 
 మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

 చేపల వేటే ఆధారంగా జీవనం సాగిస్తున్న మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చి తగు న్యాయం చేయాలి. హుద్‌హుద్ తుపాన్‌లో నష్టపోయిన మత్స్యకారులకు రూ.10వేల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇవ్వలేదు. మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లు, ఫైబర్‌నావ, ఫైబర్‌బోట్లకు బకాయిపడ్డ డీజిల్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలోని అన్ని తీరప్రాంతాల్లో మినీ జెట్టీలు, గంగవరం, భీమిలి, మహారాణిపేట, భావనపాడు, కళింగపట్నం, నువ్వులరేవు, రేవుపోలవరం, వాడలరేవు, అంతర్వేది తదితర ప్రాంతాల్లో మినీ ఫిషింగ్ హార్బర్‌లు ఏర్పాటు చేయాలి.
 - అల్లిపిల్లి ఎల్లాజీ, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల అభివృద్ధి
 సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
 
 

>
మరిన్ని వార్తలు