నేడు మహానేత జయంతి

8 Jul, 2017 01:39 IST|Sakshi
నేడు మహానేత జయంతి
ఇడుపులపాయ చేరుకున్న వైఎస్‌ జగన్‌
- శనివారం ఉదయం వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్న కుటుంబసభ్యులు
ఇడుపులపాయ నుంచి విజయవాడ ప్లీనరీకి వెళ్లనున్న వైఎస్సార్‌సీపీ అధినేత
 
సాక్షి, కడప/వేంపల్లె: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 68వ జయంతి కార్యక్రమం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో శనివారం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, జగన్‌ సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి, సోదరి వైఎస్‌ షర్మిల ఇతర కుటుంబసభ్యులు శుక్రవారమే ఇడుపులపాయకు చేరుకున్నారు. శనివారం ఉదయాన్నే వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానంతరం వైఎస్‌ జగన్‌ నేరుగా హెలికాప్టర్‌లో విజయవాడలో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశానికి వెళ్లనున్నారు.
 
ఇడుపులపాయలో యువకులతో మమేకం
కడప ఎయిర్‌పోర్టు నుంచి జగన్‌ నేరుగా ఇడుపులపాయకు వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున వేచి ఉన్న యువత కేరింతలు కొడుతూ జగన్‌తో కరచాలనం చేశారు. ఇడుపులపాయకు వచ్చిన ప్రతి ఒక్కరితోనూ జగన్‌ ఆప్యాయంగా మాట్లాడుతూ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కువమంది యువత జగన్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గానికి  చెందిన నాయకులు, కార్యకర్తలు జగన్‌ను కలసి పలు అంశాలపై చర్చించారు.