నేడు పల్స్ పోలియో

19 Jan, 2014 05:55 IST|Sakshi

ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 3,54,996 మంది 0-నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించిట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్.రామతులశమ్మ వెల్లడించారు. స్థానిక తన కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

 మొత్తం 10,935 మంది సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. వీరిలో మెడికల్ అండ్ హెల్త్‌కు సంబంధించిన 1631 మంది, ఉపాధ్యాయులు 963 మంది, 2468 మంది అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది, 2468 మంది ఆశా కార్యకర్తలు, 1730 మంది వలంటీర్లు పాల్గొంటారని తెలిపారు. 87 మొబైల్ వెహికల్స్‌ను సిద్ధం చేసినట్లు వివరించారు. అదే విధంగా మొత్తం 2491 బూత్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అర్బన్ ప్రాంతాలైన ఒంగోలులో 72 బూత్‌లు, చీరాలలో 50 బూత్‌లు, కందుకూరులో 29 బూత్‌లు, మార్కాపురంలో 35 బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని మంగమూరు రోడ్డులో ఉన్న అర్బన్ పీహెచ్‌సీలో ఆదివారం ప్రారంభిస్తారని తెలిపారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు ఆమె సూచించారు. జిల్లాలో చివరి సారిగా 2006లో తూర్పుగంగవరంలో పోలియో కేసు నమోదైనట్లు తెలిపారు. అప్పటి నుంచి పోలియో కేసులు నమోదు కాలేదని సంతోషం వ్యక్తం చేశారు.

భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014 తర్వాత గుర్తించిందని డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సరళాదేవి మాట్లాడుతూ జనవరి 19,20,21 తేదీల్లో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నేషనల్ ఇమ్యూనైజేషన్ డేగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైరిస్క్ ప్రాంతాలపై ఈ సారి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు చెప్పారు. ఎక్కువగా వలస కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, పచ్చాకు కూలీలు, భిక్షగాళ్ల పిల్లలుకు పోలియో చక్కలు దగ్గరుండి వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించండి.. అంగవైకల్యం రాకుండా చూడండి.. అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు. బూత్‌లు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పనిచేస్తాయన్నారు. రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్‌లు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు సరళాదేవి తెలిపారు.

మరిన్ని వార్తలు