ఇక కోర్టులోనే తేల్చుకుంటాం

19 Jun, 2015 04:10 IST|Sakshi
తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల చెర్మైన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకర్‌రావు

* ఏపీ విద్యుత్ ఉద్యోగులు తొందరపాటుతో కోర్టుకెళ్లారు
* ఇక చర్చలకు అవకాశం లేదు
* కోర్టుకు వెళ్లకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది
* చర్చలు జరిపి మార్గదర్శకాలపై పునఃపరిశీలన చేసేవాళ్లం
* ‘సాక్షి’తో రాష్ట్ర ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు, ఉద్యోగులతో ఇక చర్చల ప్రసక్తే లేదని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల చెర్మైన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకర్‌రావు కుండబద్దలు కొట్టారు.

ఏపీ ఉద్యోగులు తొందరపాటుతో హైకోర్టును ఆశ్రయించడంతో చర్చలకు తలుపులు మూసుకుపోయాయన్నారు. ఈ అంశాన్ని తాము సైతం కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. తెలంగాణ ట్రాన్స్‌కో రూపొందించిన ఉద్యోగుల 1,251 మంది ఏపీ స్థానికత గల ఉద్యోగులను రిలీవ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 13న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు ఈ నెల 6న, ఉద్యోగుల రిలీవ్ ఉత్తర్వులు ఈ నెల 10, 11 తేదీల్లో జారీ కాగా, కొందరు ఏపీ ఉద్యోగులు 11న హైకోర్టును ఆశ్రయించారు.

ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన ఈ అంశంపై గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.  సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ సోమవారం డివిజన్ బెంచ్ ముందు అప్పీలు పిటిషన్ వేస్తామన్నారు. ఏపీ ఉద్యోగులు తొందరపడి హైకోర్టుకు వెళ్లకుండా ఉంటే, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో మేనేజింగ్ డెరైక్టర్ విజయానంద్‌తో చర్చలు జరిపి ఆయన సూచనల మేరకు ఉద్యోగుల విభజన మార్గదర్శకాల్లో మార్పులు చేసే అవకాశం ఉండేదన్నారు.

ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు ‘సమాన హోదా’ గల ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొందించుకుందామని పలుమార్లు లేఖలు రాసినా ఏపీ సంస్థల నుంచి స్పందన లేదన్నారు. ఏపీ నుంచి సరైన సహకారం లేకపోవడంతోనే తామే ఉద్యోగుల విభజన జరిపామన్నారు. ఏపీలో పనిచేస్తున్న 450 మంది తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపాలని కోరినా అక్కడి ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు.
 
సాగర్ టెయిల్‌పాండ్ రాష్ట్రానిదే..
ఆస్తుల కేటాయింపుల్లో భాగంగా నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ తెలంగాణకు వచ్చిందని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. తాజాగా టెయిల్‌పాండ్ విద్యుత్ కేంద్రం వద్ద ఏపీ ప్రభుత్వం భద్రతా దళాలను ఎందుకు మోహరించిందో తనకు తెలియదని, ఈ అంశంపై ఇటీవల కాలంలో ఏపీతో ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు జరగలేదని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు