విద్యార్థి మృతి.. పాఠశాల నిర్లక్ష్యమే కారణం

18 Jul, 2019 09:56 IST|Sakshi
విద్యార్థి మృతదేహంతో ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తున్న రామన్నపాలెం గిరిజనులు

హోలీ ఏంజెల్స్‌ పాఠశాల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబసభ్యులు

ఐటీడీఏ ఎదుట ఆందోళన

అధికారుల హామీతో ఆందోళన విరమణ 

తమ కుమారుడు బాగా చదువుతున్నాడు. ఇంకా బాగా చదివించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలని ఆ తల్లిదండ్రులు భావించారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ఆ విద్యార్థి కూడా చదువులో రాణిస్తున్నాడు. ఐటీడీఏ ప్రోత్సాహంతో బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలోనూ అతడికి చోటు లభించింది. దీంతో రాజమహేంద్రవరంలోని హోలీ ఏంజెల్స్‌ పాఠశాలలో చేరాడు. అయితే విధి వక్రించింది. అతడి ఆశలను చిదిమేస్తూ అనారోగ్యం, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఆ బాలుడు మృతి చెందాడు. కన్నవారిని, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచాడు.  

సాక్షి, రంపచోడవరం(తూర్పు గోదావరి) : రాజమహేంద్రవరం హోలీ ఏంజెల్స్‌ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఓ గిరిజన విద్యార్థి మృతి చెందాడు. ఆ విద్యార్థి మృతదేహంతో ఆ గ్రామ గిరిజనులు, తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఐటీడీఏ ఎదుట ఆందోళన చేశారు. మండలంలోని బి.రామన్నపాలెం గ్రామానికి చెందిన కంగల సాయిబాబాదొర(16) బుధవారం రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ ఆసుపత్రిలో మృతి చెందాడు. వారం రోజుల నుంచి విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి జోగిదొర పాఠశాలకు వెళ్లి కుమారుడిని ఆసుపత్రిలో చేర్పించారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏటా ఐటీడీఏ బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తోంది. ఎంపిక చేసిన కార్పొరేట్‌ పాఠశాలకు ఐటీడీఏ ఏటా ఫీజులు చెల్లిస్తోంది. దీనిలో భాగంగానే సాయిబాబాదొర హోలీ ఎంజెల్సీలో పదో తరగతి చదువుతున్నాడు.

ఐటీడీఏ ఎదుట ఆందోళన
హోలీ ఏంజెల్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి ఐటీడీఏ ఎదుట విద్యార్థి మృతదేహంతో ఆందోళన చేశారు. వారం రోజుల నుంచి విద్యార్థి జ్వరంతో బాధపడుతున్నా పట్టించుకోలేదని, కనీసం ఇంటికి ఫోన్‌ చేసుకునేందుకు కూడా ఫోన్‌ ఇవ్వలేదని ఆరోపించారు. సకాలంలో వైద్యం చేయించి ఉంటే విద్యార్థి మృతి చెందేవాడు కాదని గ్రామస్తులు వాపోయారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని మృతదేహంతో బైఠాయించారు. దీంతో ఐటీడీఏ ఏపీఓ నాయుడు మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం తరలించారు.

గుట్టు చప్పుడు కాకుండా మృతదేహం తరలింపు
రాజమహేంద్రవరం క్రైం: పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వలన గిరిజన విద్యార్థి మృతి చెందాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. మరోవైపు పాఠశాల యాజమాన్యం చర్యలు కూడా ఆ ఆరోపణలు వాస్తవమన్నట్టుగానే వ్యవహరించారు. బాలుడు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుంటే హోలీ ఏంజెల్స్‌ పాఠశాల యాజమాన్యం ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా తమ వద్ద ఉన్న మాత్రలు వేస్తూ కాలం వెళ్లదీసింది. ఈ నేపథ్యంలో సాయిబాబు దొర పరిస్థితి విషమించడంతో హుటాహుటిన మంగళవారం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కాలేజీ యాజమాన్యం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా బాలుడు స్వగ్రామం తరలించారు. 

పాఠశాలపై అనేక ఆరోపణలు
గతంలో హోలీ ఏంజల్స్‌ పాఠశాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. మూడేళ్ల క్రితం రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ ఉన్న సమయంలో గిరిజన విద్యార్థులపై దాడులకు పాల్పడడం, వారిని కొట్టడం, మంచి భోజనం పెట్టకుండా హింసించడం, వంటివి చేయడంతో అప్పట్లో పాఠశాల విద్యార్థులు ఆందోళన చేశారు. అప్పటి సబ్‌ కలెక్టర్‌ ఈ సంఘటనపై విచారణ జరిపారు. అప్పటి ప్రభుత్వం పాఠశాల యాజమాన్యంపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా, పాఠశాల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే పాఠశాల యాజమాన్యం మరలా పాత ధోరణి అవలంభించడం, విద్యార్థులకు సరైన వసతి భోజనం పెట్టకపోవడంతో వారు పౌష్టికాహార లోపంతో ఉంటున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ పాఠశాల పై దృష్టి సారించి, విద్యార్థులను విచారణ చేసి పాఠశాలలో ఏవిధంగా జరుగుతున్నది సమగ్ర విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో పర్యవేక్షణ కరువు
ఐటీడీఏ జిల్లాలోని ఏడు బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు ఏటా ప్రవేశం కల్పిస్తోంది. ఏటా మూడు, ఐదు, ఎనిమిది తరగతుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. వీరు పదో తరగతి పూర్తయిన తరువాత బయటకు వస్తారు. ఇదే తరహాలో హోలీ ఎంజెల్స్‌ పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ రెండేళ్ల క్రితం గిరిజన విద్యార్థులు తమకు ఆహారం సరిగా పెట్టడం లేదని ఆరోపిస్తూ ఐటీడీఏ పీవోను కలిసి ఆందోళన చేశారు. గిరిజన సంక్షేమ విద్యా విభాగం బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించిన తరువాత వారి బాగోగులు పట్టించుకోవడం లేదు. దీంతో అక్కడ విద్యార్థులు ఏం తింటున్నారో, ఎలా చదువుతున్నారో, అసలు పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఎలా వ్యవహరిస్తోంది? అనేది తెలుసుకోవడం లేదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం పరిపాటిగా మారింది.


 

మరిన్ని వార్తలు