గిరిజన వర్శిటీకి మోక్షం కరువు?

1 Jun, 2016 23:59 IST|Sakshi

గిరిజన వర్శిటీ వచ్చేసిందనీ... ఇక నిధులు కూడా విడుదలయ్యాయనీ... భవనాలు వచ్చే ఏడాదికి సిద్ధమవుతాయని... నేతలు చేసిన ప్రకటనలు జిల్లా యువతలో ఆశలు రేకెత్తించాయి. ఇతర జిల్లాకు వెళ్లాల్సిన అవసరం ఉండదనీ... ఇక్కడే ఉండి చదువుకోవచ్చనీ... ఇంకా ఇతర జిల్లాలవారే ఇక్కడకు వచ్చి చదువుకుంటారనీ... ఇలా ఎన్నో కలలు కన్నారు. కానీ నేతల హామీలు అమలుకు నోచుకోలేదు. ఈ ఏడాది సైతం వర్శిటీ ఏర్పాటు కలగానే మిగిలింది.
 
 విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో గిరిజన వర్శిటీ ఏర్పాటు చేస్తామని సర్కారు చేసిన ప్రకటన ఇక్కడివారినందరినీ ఆనందంలో ముంచెత్తింది. భవనాలు వచ్చే ఏడాదికి మొదలవుతాయనీ... అందాక తరగతులు ఏయూ ప్రాంగణంలో ప్రారంభిస్తామని చెప్పగా నిజమేనని నమ్మారు. కానీ ఆ మాటలు కార్యరూపం దాల్చలేదు. జిల్లాకు మంజూరయిన గిరిజన యూనివర్శిటీ కోసం స్థలపరిశీలనకు కేంద్రబృందం వచ్చింది. అంతకు ముందుకేంద్ర మంత్రి పి.అశోక్ తదితరులతో పాచిపెంటలో పరిశీలించారు.
 
 కొత్తవలస మండలం రెల్లిలో స్థల పరిశీలన
 గతేడాది ఫిబ్రవరి 17న జిల్లాలోని బొండపల్లి మండలం గుంకలాం, కొత్తవలస మండలం రెల్లి గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించి స్థల పరిశీలన చేసింది. ప్రారంభంలో గుంకలాంలో స్థలం బాగుంటుందని భావించినా కొన్ని కారణాల వల్ల  కొత్తవలస మండలం రెల్లిలోనే గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక్కడ 347.47 ఎకరాల మైదాన ప్రాంతం, మరో 178.77 ఎకరాల కొండ గుట్టలను గుర్తించారు. మొత్తం గిరిజన యూనివర్శిటీకి ఇచ్చేందుకు 526.24 ఎకరాల భూములను గుర్తించారు.
 
  వాటిని కేంద్ర బృందం పరిశీలించి ఓకే చేసేసింది. కేంద్ర మానవ వనరుల శాఖ జాయింట్ సెక్రటరీ సుఖ్‌బీర్ సింగ్ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, రాష్ట్ర మంత్రులు స్థలపరిశీలన చేసిన తరువాత ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు ఏయూ క్యాంపస్ అధికారులతో కూడా మాట్లాడారు. త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇక్కడి అధికారులను కూడా ఆదేశించారు. దీంతో జిల్లా అధికారులు రూ.12.5 కోట్లతో ప్రతిపాదనలు కూడా తయారు చేసి పంపించారు.
 
 ప్రహరీకి నిధులు మంజూరు
 కొండలు, గుట్టలు ఉండటంతో పాటు ఈ స్థలం మీదుగా హెచ్‌టీ లైన్ కూడా ఉంది. గుట్టలు, కొండలను చదును చేసేందుకు, హెచ్‌టీ లైన్‌ను పక్కకు తప్పించేందుకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపారు. చదునుకు రూ.4.5 కోట్లు, 526 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ. 5కోట్లు, హెచ్‌టీ లైన్‌ను పక్కకు తరలించేందుకు రూ. 3 కోట్లు మొత్తం రూ. 12.5కోట్లు అవసరం అవుతాయని ప్రతిపాదనలు చేస్తే కేవలం ప్రహరీ కోసం రూ. 5కోట్లు మంజూరు చేశారు. కానీ ఇప్పటికీ ఆ నిధులు వినియోగించలేదు.
 
 చట్టం చేయకపోవడం వల్లే...
 అసలు ఈ యూనివర్శిటీకి సంబంధించి చట్టం చేయాల్సి ఉన్నందునే ఈ కార్యక్రమం నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ప్రాధమిక స్థాయిలో చేయాల్సిన పనులు కూడా ప్రారంభించకపోవడం, మరో పక్క తాత్కాలిక తరగతులు కూడా ప్రారంభించకపోవడంతో జిల్లా ప్రజానీకం, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఎదురు చూడటమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని హడావుడిగా స్థల పరిశీలన చేసి తాత్కాలిక తరగతులు ప్రారంభిస్తామని ప్రకటనలు గుప్పించేసిన ప్రజా ప్రతినిధుల ఆచూకీ ఇప్పుడు కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు, తాడేపల్లి గూడెం తదితర ప్రాంతాల్లో యూనివర్శిటీలు ప్రారంభమయ్యాయనీ విజయనగరంలో ప్రారంభించేందుకు నాయకులు ఎందుకు ప్రయత్నించడం లేదని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు