టీటీడీ గదుల కేటాయింపుల్లో మార్పులు

29 Jun, 2019 11:24 IST|Sakshi

తిరుపతి తుడా: తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాల్లో భక్తుల సౌకర్యార్థం గదుల కేటాయింపుల్లో టీటీడీ స్వల్ప మార్పులను తీసుకురానుంది. తిరుపతిలో ఉన్న విష్ణు నివాసం, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో జూలై 1 నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. ఇక నుంచి విష్ణు నివాసంలోని అన్ని గదులను కరెంటు బుకింగ్‌లో మాత్రమే కేటాయిస్తారు. ఇక్కడ గదులు పొందిన భక్తులు 24 గంటల్లో ఖాళీ చేయాల్సి ఉంటుంది.

శ్రీనివాసం, మాధవం సముదాయాల్లో అన్ని గదులను ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ రెండు వసతి సముదాయాల్లోనూ 24 గంటల స్లాట్‌ విధానం అమలు కానుంది. బుక్‌ చేసుకున్న సమయానికి ఆలస్యంగా చేరుకున్నా.. నిర్ణీత సమయానికి ఖాళీ చేయాల్సి ఉంటుంది. శ్రీనివాసం, మాధవం అతిధి గృహాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, స్థానికులు గదులు పొంది బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

4న శ్రీవారి విగ్రహానికి శిలా సంగ్రహణం
ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని వెంకటపాలెం గ్రామంలో టీటీడీ నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతిష్టించేందుకు తిరుపతి సమీపంలోని రామాపురం గ్రామం వద్ద జూలై 4న శిలా సంగ్రహణం నిర్వహించనున్నట్లు తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని జేఈవో నివాసంలో శుక్రవారం శిలా సంగ్రహణంపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. లక్ష్మీకాంతం మాట్లాడుతూ..4న ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు శిలా సంగ్రహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. టీటీడీ ఆగమ సలహాదారులు, అర్చకులు, స్తపతి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు