స్వామి వారి విలువ వంద కోట్లేనా...?

20 Jun, 2018 14:56 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న రమణదీక్షితులు

టీటీడీ పాలకమండలిపై రమణదీక్షితులు ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌ : గత కొంతకాలంగా టీటీడీ పాలకమండలిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి తెరపైకి వచ్చారు. తన ఆరోపణలకు సమాధానం చెప్పలేకనే టీటీడీ పాలకమండలి తనపై పరువు నష్టం దావా వేసిందని మండిపడ్డారు. తాను చెప్పినవన్ని వాస్తవాలేనని, వాటి గురించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసారు.

ఈ సందర్భంగా బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్వామి వారి పూజలు, నైవేద్యాల్లో లోపాలు జరుగుతున్నాయి. స్వామి వారికి ఆరాధనలు సరిగా జరగడం లేదన్నందుకు నా మీద 100 కోట్ల రూపాయల పరువు నష్టం వేసారు. అంటే స్వామి వారి పరువును కేవలం వంద కోట్లకే పరిమితం చేస్తున్నారా’ అంటూ ప్రశ్నించారు.

ఆభరణాలు తరలిపోతున్నాయి...
శ్రీవారికి ఎందరో రాజులు విలువైన ఆభరణాలు సమర్పించారు. వాటి వివరాలను శిలాశాసనాలలో కూడా​ పొందుపరిచారు. కానీ నేడు అవన్ని తరలిపోతున్నాయి. వంటశాల నుంచి నేలమాళిగకు దారి ఉన్నట్లు తెలుస్తుంది. స్వామి వారి సంపద అంతా నేలమాళిగలోనే ఉందని, అక్కడకు సామాన్యులు వెళ్లలేరని తెలిపారు.

స్వామి వారిని పస్తులు ఉంచారు...
ఎవరికి చెప్పకుండా పోటును మూసివేసారు. పోటు మూసి వేస్తే ప్రసాదాలు, నైవేద్యాలు ఎక్కడ తయారు చేస్తారని ప్రశ్నించారు. అందుకే స్వామి వారిని 25 రోజుల పాటు పస్తులు ఉంచారని విమర్శించారు. పోటును మూసివేసి అక్కడ భారీగా తవ్వకాలు జరిపారని...పోటు తలుపులు తీసిన తరువాత చూస్తే అక్కడ భూకంపం వచ్చినట్లుగా ఉందన్నారు. తాను వెంటనే ఈ విషయం గురించి జేఈఈని అడిగానని..కానీ ఆయన సరిగా స్పందించలేదన్నారు. ఎవరో మేడం చెప్పిందని తవ్వకాలు జరిపామన్నారు. కానీ తరువాత కాలంలో స్వయంగా జేఈఈనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పోటులో తవ్వకాలు జరిపామని తెలిపారన్నారు.

వీటన్నింటి గురించి ప్రశ్నిస్తే తనను ఉద్యోగం నుంచి తొలగించారని మండిపడ్డారు. తాను వద్దని వారించిన వినకుండా అతిక్రూరంగా ఆనాడు వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించారని మండిపడ్డారు. ఈ తొలగింపుల్లో నాలుగైదు నిధులు దొరికాయని బయట ప్రచారం జరుగుతుందని తెలిపారు. మిరాశీ, వంశ పారంపర్య అర్చకత్వం రెండూ వేరు. కానీ ద్వేషపూరితంగా మిరాశీ వ్యవస్థను రద్దు చేయడమే కాక వంశపారంపర్య అర్చకత్వాన్ని కూడా రద్దు చేశారని విమర్శించారు. కానీ దీనిపై తాము సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయం సాధించమని గుర్తు చేసారు.

సీబీఐ విచారణ జరపాలి...
గతంలో ఆభరణాల్లో ఏమైనా తరుగులు ఉంటే అర్చకుల నుంచి డబ్బులు వసూలు చేసే వారని... అందుకే అర్చకులు ఆభరణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారని గుర్తు చేసారు. కానీ నేడు శ్రీవారి ఆభరణాల బాధ్యత సరిగా నిర్వర్తించడం లేదని.. తరుగులు, రాలిపోయిన రాళ్లకు బాధ్యత లేకుండా పోయిందని వాపోయారు. తాను చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసారు.

ఆలయంలో అపవిత్ర కార్యక్రమాలు...
2017లో శ్రీవారి ఆలయంలో రెండు అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఇలా స్వామి వారికి అపవిత్రత ఆపాదించే కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వైదిక విజ్ఞానం లేని అధికారులను నియమిస్తున్నారని అందువల్లే మన ఆచార, వ్యవహారాలు వారికి తెలియడంలేదని ఆరోపించారు. అధికారులు శుచి, శుభ్రత పాటించడం లేదని మండిపడ్డారు. తాను ఉన్నంత వరకూ శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడనని, కానీ ఇప్పటికి శ్రీవారి ఆలయంలో అర్చకులకు విలువ లేదని బాధపడ్డారు.

మరిన్ని వార్తలు