అడవిలో దొంగలు పడ్డారు!

17 Jun, 2014 01:48 IST|Sakshi
అడవిలో దొంగలు పడ్డారు!

ఆత్మకూరు రూరల్: పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన నల్లమలలో రక్షణ కరువైంది. విస్తారమైన వృక్షసంపద నిలయమైన కొండలను సంరక్షించడంలో అటవీ అధికారులు విఫలమవుతున్నారు. అక్రమార్కులు యథేచ్ఛగా ఫారెస్టులో సంచరిస్తున్న వారిని పట్టుకునే నాథుడు లేడు. వన్యప్రాణులను లెక్కించేందుకు, స్మగ్లర్లు, వేటగాళ్లను పసిగట్టేందుకు అడవిలో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటీ రేంజ్‌లో ఇటీవల రెండు కెమెరాలు మాయం కావడంతో నల్లమలలో ఏ పాటి నిఘా ఉందో ఇట్టే అర్థమవుతోంది.
 
సిబ్బంది నిర్లక్ష్యమే కారణం..
ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో నల్లమల 15 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇందులో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పి, తదితర జాతులకు చెందిన జంతువులు ఉన్నాయి. వీటి సంరక్షణకోసం అటవీశాఖ దాదాపు 200 మందికి పైగా సిబ్బందిని నియమించింది. 12 బేస్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది రెండు, మూడు సార్లు ఈ ప్రాంతంలో ఉండే పెద్దపులులు, చిరుతలు, ఆయా జాతులకు చెందిన వన్య ప్రాణులను లెక్కిస్తుంటారు. వీటి లెక్కింపుతో పాటు పొలపర్లను, అటవీ స్మగ్లర్లను గుర్తించేందుకు వీలుగా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటీ, నాగలూటి, ఆత్మకూరు, వెలుగోడు రేంజ్‌లలో 130 కెమెరాలను ఏర్పాటు చేశారు.
 
ప్రధానంగా నాగలూటి పెచ్చెర్వు, పంగిడి, పావురాలగుట్ట, దామర్లకుంట, సుద్దకుంట, జీబీఎం ప్రాంతాల్లో కెమెరాలను అమర్చారు. ఈ ఏడాది జనవరి, మే నెల 9 నుంచి 14 వరకు పెద్దపులుల గణాంకాల సేకరణ చేపట్టారు. కెమెరా ట్రాప్‌లలో ఎన్ని వన్యప్రాణులు నిక్షిప్తమయ్యాయో తెలుసుకుని పూర్తి వివరాలు వెల్లడించే క్రమంలో అటవీ సిబ్బంది నిమగ్నమయ్యారు. అన్ని ప్రాంతాల్లో అమర్చిన కెమెరాలను సేకరించారు. అయితే బైర్లూటీ రేంజ్ పరిధిలోని పావురాలగుట్ట పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెండు కెమెరాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు అటవీ సిబ్బంది గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.40 వేలు ఉంటుంది.
 
విషయం బయటకు పొక్కకుండా ఉండేలా కెమెరాల కోసం అడవిలో సిబ్బంది అన్వేషణ చేపట్టారు. అయినా ఫలితం దక్కకపోవడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అటవీ సమీప గ్రామాలకు చెందిన పొలపర్లపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లపైనే దృష్టి సారించకుంటే ఇక అటవీ, వన్యప్రాణులను ఎలా సంరక్షిస్తారంటూ పలువురు వన్యప్రాణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై బైర్లూటీ రేంజ్ ఆఫీసర్ అశోక్‌కుమార్‌యాదవ్‌ను సాక్షి వివరణ కోరగా అలాంటిదేమి లేదంటూ చెప్పడం గమనార్హం.

మరిన్ని వార్తలు