రాత్రి గస్తీ తిరిగే పోలీసులే అత్యాచారం చేశారు!

3 Dec, 2014 02:41 IST|Sakshi
రాత్రి గస్తీ తిరిగే పోలీసులే అత్యాచారం చేశారు!

 అసాంఘిక శక్తులను అంతమొందించాల్సిన రక్షకభటులే భక్షకులుగా మారిన వైనమిది. రాత్రి గస్తీ తిరుగుతూ ఓ యువతిని లోబరుచుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. నిర్భయతరహాలో జరిగిన ఈ సంఘటనకు బాధ్యుడు పోలీసు కానిస్టేబుల్ కావడం చర్చనీయూంశమైంది. యువతికి తోడుగా ఉన్న యువకుడిని తరిమేసి... పోలీసు కామవాంఛ తీర్చుకున్నట్టు తెలియవచ్చింది. దీనిపై స్పందించిన ఎస్పీ చర్యకు సన్నద్ధమయ్యూరు.
 
 గుంటూరు  : పోలీసుల కీచకపర్వం వెలుగులోకి రావడంతో నగర ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి వేళ అసాంఘిక శక్తులను గుర్తించి నియంత్రించాల్సిన రాత్రి గస్తీ పోలీసులే అమాయకమైన ఓ యువతిని లొంగదీసుకోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నడిబొడ్డులో ఆస్పత్రులు, ప్రధాన కార్యాలయాలు, పోలీసుస్టేషన్‌కు కొద్దిదూరంలోనే ఉన్న ప్రాంతంలోనే బాధితురాలికి అన్యాయం జరగడం పోలీసుల నైతిక ప్రవర్తనకు మచ్చతెచ్చేలావుందని విమర్శలు వస్తున్నాయి. యువతికి తోడుగా ఉన్న యువకుడిని తరిమేసి.. పోలీసులు కామవాంఛ తీర్చుకోవడం గమనార్హం! పొత్తూరువారితోట మెయిన్‌రోడ్డులో నడిచివెళుతున్న ఓ యువతిని రాత్రి గస్తీలో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డు బెదిరించి అత్యాచారం చేశారన్న వార్తపై అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ విచారణ చేపట్టారు.

సేకరించిన సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి ఓ యువకుడు, యువతి పొత్తూరువారితోటలో నడిచి వెళ్తుండగా, రాత్రి గస్తీలో ఉన్న ఓ కానిస్టేబుల్, హోంగార్డు వారిని ఆపి విచారించారు. యువకుడిని బెదిరించి పంపించివేసి అనంతరం ఆ యువతిని భయపెట్టి లొంగదీసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం తెలియగానే అర్బన్ ఎస్పీ తీవ్రంగా స్పందించారు. ఎస్‌హెచ్‌వో సెలవులో ఉండడంతో విచారణ చేపట్టాల్సిందిగా ఇద్దరు ఎస్‌ఐలను ఎస్పీ మంగళవారం ఆదేశించారు. ఆమేరకు ఎస్‌ఐలు విచారణ జరిపి రాత్రి గస్తీలో ఉన్న సిబ్బందిని విచారించి ఇద్దరు కానిస్టేబుళ్లలో ఎవరన్నదీ నిర్థారణకు వచ్చారు.

అయితే బాధితురాలి నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్పీకి నివేదించారు. అయినా ఎస్పీ స్టేషన్ సిబ్బంది ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసి ఎస్‌ఐలు ఇద్దరినీ తన కార్యాలయానికి పిలిపించుకుని సంఘటనా పూర్వాపరాలపై విచారించారు. బాధిత యువతి నంద్యాల వాసి అని తెలుసుకున్న ఎస్పీ రాజేష్‌కుమార్.. ఆమె చిరునామా తెలుసుకుని ఫిర్యాదు తీసుకోవాలని ఎస్‌ఐలను ఆదేశించారు. అందుకోసం ఇద్దరు సిబ్బందిని నంద్యాలకు పంపాలని ఆదేశించినట్లు సమాచారం. సిబ్బంది పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

 సీసీ కెమెరా పుటేజ్‌లో.. సంఘటన జరిగిన సమీపంలోని ఓ కార్యాలయం వెలుపల ఉన్న సీసీ కెమెరాలో కానిస్టేబుల్, హోంగార్డు యువకుడు, యువతిని బెదిరిస్తోన్న సంఘటన రికార్డు అయింది. ఈ పుటేజ్‌ను పోలీసులు సేకరించారు. విచారణను వేగవంతం చేశారు.

మరిన్ని వార్తలు