ఎంపీ లగడపాటి ఇద్దరి భార్యల పిటిషన్ కొట్టివేత

19 Sep, 2013 18:53 IST|Sakshi
ఎంపీ లగడపాటి ఇద్దరి భార్యల పిటిషన్ కొట్టివేత

ఢిల్లీ: ఎంపీ లగడపాటి రాజగోపాల్కు  ఇద్దరు భార్యలున్నారని  దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రెండో పెళ్లికి సంబంధించి పిటిషనర్‌ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని కోర్టు తెలిపింది.

 లగడపాటి రాజగోపాల్ మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర కూతురు పద్మను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూమారులు. అయితే 2004లో తనకు ఇద్దరు కుమారులు మాత్రమేనని ఎన్నికల అఫిడవిట్లో ఆయన తెలియజేశారు.  2009లో సమర్పించిన అఫిడవిట్లో మాత్రం తనకు ముగ్గురు కూమారులని చెప్పారు. మూడో కుమారుడి పేరు ఎల్.హర్మన్ అని పేర్కొన్నారు. దాంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

లగడపాటి రాజగోపాల్కు రెండవ పెళ్ళి జరిగిందని, వారికి ఒక కుమారుడు కూడా జన్మించాడని కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన న్యాయవాది సుంకర కృష్ణమూర్తి గతంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ)కి ఫిర్యాదు చేశారు.  ఎన్నికలలో రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసిన అఫిడవిట్లో నాలుగవ డిపెండెంట్గా మూడవ కుమారుడు హర్మన్ పేరును ప్రస్తావించారు.  లగడపాటి జానకి అనే మహిళను రెండవవివాహం చేసుకున్నారని, వారిద్దరికీ జన్మించిన పుత్రుడే హర్మన్  అని కృష్ణమూర్తి పేర్కొన్నారు. లగడపాటి, జానకి దండలు వేసుకున్న ఫోటోను కూడా ఆయన జతపరిచారు. వారిద్దరికీ జన్మించిన హర్మన్ జనన నిర్థారణ పత్రాన్ని కూడా ఆయన జతపరిచారు.

లగడపాటి ఇద్దరు భార్యల విషయమై ఆయన రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఒక సందర్భంలో  విమర్శలు గుప్పించారు. ఈ నేపధ్యంలో లగడపాటి రెండవ పెళ్లి చేసుకున్నట్లు కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే లగడపాటి రెండవ పెళ్లి చేసుకున్నట్లు పిటిషనర్ ఆధారాలు చూపలేదని కోర్టు కొట్టివేసింది.

మరిన్ని వార్తలు