వర్సిటీల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాల్సిందే

14 Nov, 2014 02:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: బోధనాసిబ్బంది లేక దెబ్బతింటున్న యూనివర్సిటీలను గాడిలో పెట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నడుం బిగించింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా అన్ని యూనివర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేసి, సిబ్బందికి అవసరమైన శిక్షణలు పూర్తి చేయాలని వైస్-ఛాన్స్‌లర్లను ఆదేశించింది. నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు యూజీసీ చైర్మన్ వేద్‌ప్రకాశ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

అధ్యాకుల్లేక కునారిల్లుతున్న వర్సిటీల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం చాలా వర్సిటీల్లో అనేక ఖాళీలు ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పార్ట్‌టైం, కాంట్రాక్ట్‌వారిని నియమించినా ఆశించిన ప్రయోజనాలు చేకూరడం లేదన్నారు. ఖాళీలభర్తీకి యూనివర్సిటీల వారీగా అర్హులైన వారిని గుర్తించాలని తెలిపారు. అవసరమైతే ఇతర ప్రాంతాలకు చెందిన వారిని అధ్యాపకులను నియమించాలన్నారు.

డిగ్రీస్థాయిలో అన్నిబ్రాంచీల్లో  పాఠ్యాంశంగా పర్యావరణ విద్య
యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో డిగ్రీకోర్సుల్లో పర్యావరణ విద్యను ప్రవేశపెట్టాలని కూడా యూజీసీ ఆదేశించింది. గురువారం యూజీసీ కార్యదర్శి జస్పాల్ సంధు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆరునెలలపాటు సిలబస్ ఉండేలా దీనిని ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వెంటనే అమలు చేయాలని ఆదేశించారు.

బోధనేతర సిబ్బంది నైపుణ్యాల అభివృద్ధికి కౌన్సిల్
పాఠశాల విద్య, కళాశాల విద్య, యూనివర్సిటీల్లో బోధనేతర సిబ్బందిలో నైపుణ్యాల అభివృద్ధికి కోసం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా నైపుణ్యాల అభివృద్ధి కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు