పెట్టుబడులపై ఆసక్తిగా ఉన్నాం

11 Aug, 2019 04:42 IST|Sakshi

వివిధ రంగాల్లో భాగస్వాములం కావడానికి సిద్ధం

ఏపీలో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయి

‘సాక్షి’తో యూకే డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌

సాక్షి, అమరావతి: సుదీర్ఘ పాదయాత్రలో యువత కష్టాలను చూసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి భరోసా ఇచ్చే విధంగా పలు చర్యలు తీసుకుంటున్నారని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ కొనియాడారు. దౌత్య సదస్సుకు హాజరైన సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. యువతలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం శుభసూచకమన్నారు. ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఫ్లెమింగ్‌ తెలిపారు. యువ ముఖ్యమంత్రి నాయకత్వంలోని పరిపాలన తీరు తమను ఎంతగానో ఆకట్టుకుంటోందని.. విద్య, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో రాష్ట్రంతో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆదాయం పెంచే విధంగా దిగుబడులు పెంచడం, శీతల గిడ్డంగుల నిర్మాణం, ఎస్‌ఎంఈ వంటి రంగాల్లో కూడా పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజా రవాణా వ్యవస్థలో విద్యుత్‌ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుండటంతో ఈ అవకాశాన్ని తాము వినియోగించుకోనున్నట్లు తెలిపారు. శ్రీసిటీ వంటి సెజ్‌లతో మాన్యుఫాక్చరింగ్‌ కేంద్రంగాను, వైజాగ్‌ను ఐటీకి కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుండటంతో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయన్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తో బ్రిటన్‌ సత్సంబంధాలను కలిగి ఉందని, యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ఈ బంధం మరింత దృఢపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. విశాఖలో హెచ్‌ఎస్‌బీసీని ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటికే 3,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. దౌత్య సదస్సు సందర్భంగా ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులతో చర్చలు చాలా బాగా జరిగాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అంశాలకు సంబంధించి చర్చించడానికి త్వరలోనే రెండోసారి ముఖ్యమంత్రితో సమావేశం కానున్నట్లు ఫ్లెమింగ్‌ తెలిపారు.

సీఎంను కలిసిన యూకే డిప్యూటీ హైకమిషనర్‌ 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. 

మరిన్ని వార్తలు