ఎవరి జేబుల్లో చూసినా ఆ సిగరెట్లే...

23 Oct, 2018 13:23 IST|Sakshi
కిరాణా షాపులో సిగరెట్లు స్వాధీనం చేసుకుంటున్న తూనికల కొలతల ఇన్‌స్పెక్టర్‌ కొండారెడ్డి

జిల్లాలో జోరుగా అనధికార సిగరెట్ల విక్రయాలు

నెలకు దాదాపు రూ.10 కోట్ల విక్రయాలు

ప్రకాశం, మార్కాపురం: జీఎస్టీ వచ్చాక అన్ని రకాల సిగరెట్లు రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగాయి. ఇదే అదనుగా నాసిరకం సిగరెట్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ప్రభుత్వ అనుమతి లేని మోండ్, వీనస్, పారిస్, విల్‌ పేర్లతో మయన్మార్, చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, పాకిస్తాన్‌ నుంచి దేశంలోకి వివిధ మార్గాల్లో వస్తున్నాయి. ధర తక్కువ కావడంతో వినియోగదారులు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మామూలు సిగరెట్లు రూ.10 నుంచి రూ.15 ఉంటే, అనధికార సిగరెట్లు రూ.3 నుంచి రూ.5లకే దొరుకుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనధికార సిగరెట్ల విక్రయాలు సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటున్నట్లు అంచనా. ఇక్కడికి చెన్నై, విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నుంచి అమ్మకాలు జరుగుతున్నాయి.

ఎక్కడ నుంచి వస్తున్నాయి..?
అసలు ఈ సిగరెట్లు ఎక్కడ తయారవుతున్నాయో, ఎలా తయారవుతున్నాయో ఎవరికి తెలియదు. అయితే ఎటువంటి పన్నులు, అనుమతులు లేకపోవడం, ధర తక్కువ కావడంతో వ్యాపారులు కూడా ఈ సిగరెట్ల విక్రయాలపై ఆసక్తి చూపుతున్నారు. అడపా దడపా తూనికల, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించి వ్యాపారులపై కేసులు నమోదు చేస్తుంటారు.

ధర తక్కువ కావడతో..
పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్‌ వస్తుందని తెలిసినా యువత, ధూమపానం ప్రియులు సిగరెట్ల వాడకం నుంచి బయటç ప³డలేక పోతున్నారు. ధర తక్కువ కావటంతో పది, ఇంటర్‌ చదివే పిల్లలు కూడా ఫారిన్‌ సిగరెట్లు తాగుతున్నారు. సిగరెట్‌ అలవాటు ఉన్న వారు బ్రాండెడ్‌ సిగరెట్లు ప్యాకెట్‌ కొనాలంటే రోజుకు రూ.150 ఖర్చు చేయాల్సి వస్తోంది. అనధికార సిగరెట్లు  రూ.30నుంచి రూ.50లకే దొరుకుతున్నాయి. పొగాకు వ్యర్థాలతో ఇలాంటి సిగరెట్లు తయారు చేస్తున్నారు. ఇవి తాగడం  వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. సాధారణ సిగరెట్లలో ఉండే ఫిల్టర్‌ వ్యవస్థ ఇందులో ఉండటం లేదు. సిగరెట్‌ ప్యాకెట్లపై తయారీదారుల వివరాలు ముద్రించటం లేదు.

ఇటీవల నమోదైన కేసులు  
ఏప్రిల్‌ 4న కంభంలోని మూడు షాపుల్లో 13 దిండ్లు ఫారిన్‌ సిగరెట్లను (అనధికారమైనవి)తూనికల కొలతలశాఖ ఇన్‌స్పెక్టర్‌ కొండారెడ్డి దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకుని కేసులు కట్టారు. వీటి విలువ సుమారు రూ.5వేలు ఉంటుంది.
ఏప్రిల్‌ 28న దోర్నాలలో స్థానిక పోలీసులు సుమారు రూ. 75వేల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
మే 11న దర్శిలో, జూన్‌ 4న కంభంలో, సెప్టెంబర్‌ 5న దర్శిలో తూనికల కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌ వివిధ షాపులపై దాడులు చేసి అనధికార సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.15వేల వరకు ఉంటుంది.
సెప్టెంబర్‌ 16న కనిగిరిలో రూ.10వేల విలువ చేసే సిగరెట్లను, 18న పీసీపల్లిలో రూ.17వేల విలువైన సిగరెట్లను, 26న సింగరాయకొండలో, ఒంగోలులో సుమారు రూ.20వేల విలువ చేసే సిగరెట్లను తూనిక కొలతల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద అనధికార సిగరెట్లు మార్కెట్‌ను ముంచెత్తుతూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తున్నాయి.

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం
సిగరెట్లు సేవించటం వల్ల క్యాన్సర్‌తో పాటు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. ఇటీవల కాలంలో సిగరెట్‌ తాగుతున్న వారు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. సిగరెట్‌ మానివేయాలి. ఆకస్మికంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
– డాక్టర్‌ దర్శి రామకృష్ణ, మార్కాపురం

 కేసులు నమోదు చేస్తున్నాం
మార్కెట్‌లో కొన్ని సిగరెట్లు ఐటీసీ అనుమతి లేకుండా వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా మోండ్, వీనస్, పారిస్, విల్‌ పేర్లతో ఉన్న వాటికి ప్రభుత్వ అనుమతి లేదు. ఇటీవల కాలంలో మార్కాపురం, కంభం, కనిగిరి, దర్శి, ఒంగోలు ప్రాంతాల్లో వివిధ షాపులపై దాడులు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నాం. వ్యాపారులు ఎవరు ఇలాంటి సిగరెట్లు విక్రయించకూడదు.
– కొండారెడ్డి, తూనికల కొలతల శాఖఇన్‌స్పెక్టర్, మార్కాపురం

మరిన్ని వార్తలు