ఆలయాల అభివృద్ధికి వెయ్యికోట్లివ్వండి

8 Jun, 2014 00:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని దేవాలయాల అభివృద్ధికోసం, అర్చకుల సంక్షేమంకోసం రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉపేంద్రశర్మ కోరారు. తెలంగాణలోని అర్చక సమాఖ్య అధ్యక్షులు, ప్రతినిధులతోపాటు ఆయన శనివారం ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్యను కలిసి అర్చకుల సమస్యలు, దేవాలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు. విలేకరులతో మాట్లాడారు. తమ డిమాండ్లను వారు వివరించారు. అవి..
 తెలంగాణలోని 11 వేల దేవాలయాల్లో పనిచేస్తున్న లక్షా నలభైవేల అర్చక ఉద్యోగుల స్థితిగతిపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలి.
 
 2007లో చేసిన దేవాదాయశాఖ చట్టసవరణను అనుసరించి.. సెక్షన్ 68-ఏ ప్రకారం వేతన సవరణ చట్టాన్ని అమలు చేయాలి.
 
 అనేక ప్రధాన దేవాలయాల్లో మూడేళ్లక్రితం వేద పారాయణదారులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. వారిని క్యాడర్ స్ట్రెంత్‌లో చేర్చాలి.
 
 వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అమలు చేసిన అర్చక సంక్షేమ పథకాలను కొనసాగించాలి.
 టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ధూప, దీప, నైవేద్య పథకంలో పనిచేసే అర్చకులకు రూ.2,500 నుండి రూ.6,000 వరకు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి.

మరిన్ని వార్తలు