చింతమనేనీ.. దళిత జాతికి క్షమాపణ చెప్పు

26 Feb, 2019 08:41 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ కన్వీనర్లు అబ్బయ్యచౌదరి, తానేటి వనిత

అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి కాళ్లు పట్టుకోవాలి

వైఎస్సార్‌ సీపీ కన్వీనర్లు వనిత, అబ్బయ్యచౌదరి డిమాండ్‌

పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్య లకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అంబే డ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి ఆయన కాళ్లు పట్టుకుని దళిత జాతికి క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌ సీపీ కొవ్వూరు కన్వీనర్‌ తానేటి వనిత డిమాండ్‌ చేశారు. ఏలూరు వైఎ స్సార్‌ సీపీ కార్యాలయంలో దెందులూరు కన్వీనర్‌ కొఠారు అబ్బయ్యచౌదరితో కలిసి ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. చింతమనేనితో క్షమాపణ చెప్పించే విషయంలో సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలన్నారు. దళితుల కుటుంబాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు వ్యాఖ్యానించి దళితులపై దాడులకు పచ్చజెండా ఊపినట్టు అర్థమవుతోందన్నారు.

దళితుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సింది పోయి వారిని కించపరచడమే లక్ష్యంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై కొవ్వూరు నియోజకవర్గంలోని పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదులు చేసినా ఒక్కచోట కూడా కేసు నమోదుచేయకపోవడం ఈ ప్రభుత్వానికి దళితులపై ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతోందన్నారు. వారి అరాచకాలకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. చింతమనేని, తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించేది దళితులేనని, ఓటుతో వారికి బుద్ధి చెబు తామని పిలుపునిచ్చారు. చింతమనేని నోరు అదుపులో పెట్టుకోవాలని, అధికారం శాశ్వ తం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల న్నారు. చింతమనేని దౌర్జన్యానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చింతమనేని అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాలు పేట్రేగిపోతున్నాయని, అతడిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ఎన్నికల కమిషన్‌ ప్రకటించాలని కోరారు.

‘దమ్ముంటే నాపై పోటీ చేయాలి’
దమ్ముంటే నాపై పోటీ చెయ్యి చింతమనేనీ అంటూ వైఎస్సార్‌ సీపీ దెందులూరు కన్వీనర్‌ కొఠారు అబ్బయ్యచౌదరి సవాల్‌ విసిరారు. చింతమనేని స్థాయిని మరిచి జగన్‌ను తనపై పోటీచేయమని ఒకసారి, పవన్‌ కల్యాణ్‌ను తనపై పోటీ చేయమని మరోసారి సవాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారిద్దరూ కాదని కనీసం తనపైనైనా గెలవడానికి ప్రయత్నించాలని అబ్బయ్యచౌదరి హితవుపలికారు. రాష్ట్రంలో దళితులపై ప్రేమ ఉంటే దళితులను అవమానించిన చింతమనేనిని వెంటనే అరెస్ట్‌ చేయించు చంద్రబాబూ అని డిమాండ్‌ చేశారు.  దెందులూరు నియోజకవర్గంలో పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన చింతమనేని ఇప్పుడు రాజధాని అమరావతి, విశాఖల్లో వందలాది ఎకరాల భూములు సొంతం చేసుకుని శ్రీమంతుడయ్యారని అన్నారు. తమ్మిలేరులో ఇసుకను, పోలవరం గట్టుపై ఉన్న మట్టిని అమ్ముకుని కోట్లు గడించారన్నారు. నియోజకవర్గంలోని వట్లూరులో వెమ్‌టెక్‌ అనే సంస్థ పేరిట 300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. విజయరాయి గ్రామంలో పెన్షన్‌ తీసుకోవడానికి వచ్చిన 85 ఏళ్ల వృద్ధుడిని దుర్భాషలాడి అతని కుమారులపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. పెదవేగి మండలం గుమ్మడిగుంట గ్రామానికి చెందిన దళితుల భూముల విషయంలో 70 రోజులు ఆందోళన చేస్తే ఒక్కరోజైనా వెళ్లి వారిని పరామర్శించారా అని చింతమనేనిని ప్రశ్నించారు.

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, అధికారులు, సాధారణ ప్రజలను కూడా వేధిస్తూ చింతమనేని రాక్షస పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేసిన రోజునే కటకటాల వెనక్కి నెట్టాల్సిన నిన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు వదిలి వేయడంతోనే బరితెగించావన్నారు. సొంత పార్టీకి చెందిన నాయకులపైనే దాడి చేసిన నీకు వ్యతిరేకంగా గ్రామమంతా ఏకమై పోరాటం చేసిన విషయం నిజం కాదా అన్నారు. ఇటీవల దళితులపై చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్ర బాబు మాత్రం చింతమనేనిని వెనకేసుకొస్తూ అది మార్ఫింగ్‌ చేసిన వీడియో అని ప్రకటించడం దళితులను అవమానించడమేనన్నారు. వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ నాయకులు నూకపెయ్యి సుధీర్‌బాబు, మున్నుల జాన్‌ గురునాథ్, పల్లెం ప్రసాద్, దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు