-

సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

2 Oct, 2019 15:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన 151 స్థానాల్లోనే గాకుండా.. టీడీపీ గెలిచిన నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కాకముందే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకర్గంలోని 11వ డివిజన్‌లోని వార్డు సచివాలయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో 285 సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెక్రటేరియట్‌కు ఎన్నికైన అభ్యర్థులపై గురుతర బాధ్యతను ఉంచారని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు వారి పార్టీ అధికారంలో లేని ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదని.. జలు పచ్చ చొక్కా వేస్తేనే అభివృద్ధి.. అన్నట్లుగా ఆయన పనిచేశారని విమర్శించారు. తూర్పు నియోజకవర్గంలో కష్టపడుతుంది బొప్పన భవకుమార్‌ అయితే... కొబ్బరికాయ కొట్టేది మాత్రం టీడీపీకి చెందిన గద్దె రామ్మెహన్‌ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జి బొప్పన భవకుమార్‌, నగర మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గాంధీజీ 150వ జయంతి స్పూర్తితో ముఖ్యమంత్రి సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ పాలనలో సచివాలయ వ్యవస్థ ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. గతంలో జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తేనే పని జరిగేదని విమర్శించారు. అవినీతి, లంచాలు లేకుండా ప్రజలకు సచివాలయాలు సేవలందిస్తాయని తెలిపారు. నాలుగు వేల మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేయగా ఇవి ప్రజలకు జవాబుదారీగా ఉంటాయన్నారు. ఇక బొప్పన భవకుమార్ మాట్లాడుతూ పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలను తెలుసుకున్నారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రీయింబర్స్మెంట్ ఇచ్చి చదువు చెప్పించారని, ప్రస్తుతం ఆయన తనయుడు జగన్‌మోహన్రెడ్డి ఉపాధి కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు