కదంతొక్కిన వెలుగు ఉద్యోగులు

14 Dec, 2018 13:24 IST|Sakshi
నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

ఏబీఎం కాంపౌండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ

సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌    

నెల్లూరు(పొగతోట): నెల్లూరులో వెలుగు ఉద్యోగులు భారీ ర్యాలీతో కదంతొక్కారు. తమను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. గురువారంతో దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే రోడ్లు శుభ్రం చేయండం, రక్తదానం, వంటా వార్పు తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గురువారం ఏబీఎం కాంపౌండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న వెలుగు ఉద్యోగులకు జిల్లా సమాఖ్య సభ్యులు, స్వయం సహాయక గ్రూపు సభ్యులు, వీఓఏలు, కల్యాణమిత్రలు, బీమామిత్రలు, ఎంఎస్‌సీసీలు, సీసీలు ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. సుమారు రెండు వేలమందితో ర్యాలీ జరిగింది. ధర్నాతో కలెక్టరేట్‌ ప్రాంగణం దద్దరిల్లింది. ప్రభుత్వానికి, సెర్ప్‌ సీఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పట్టించుకోలేదు
ఈ సందర్భంగా వెలుగు ఉద్యోగుల సంక్షేమ సంఘం, జేఏసీ నాయకులు మాట్లాడుతూ 18 సంవత్సరాల నుంచి వెట్టిచాకిరి చేస్తున్నామన్నారు. పీజీలు, డబుల్‌ పీజీలు చేసిన వారు వెలుగులో పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండునాల్కల ధోరణితో వెలుగు ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన 2012లో ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారన్నారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి వస్తే రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగన్నర సంవత్సరాలు గడిచినా ఇంతవరకు తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెర్ప్‌ సీఈఓ ఒక అధికారిగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. సమ్మె విరమించి రండి.. సీఎం వద్దకు తీసుకెళతా అని మభ్యపెడుతున్నారన్నారు. సీఎంతో చర్చించి ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌ విషయాన్ని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేలా చర్యలు తీసుకుంటామని కొందరు మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉద్యోగులను రెగ్యులర్‌ చేసేంత వరకు సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వెలుగు ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ఎం.కృష్ణయ్య, సింహాద్రి, మధుసూదనరావు, జనార్దన్, ఆదిశేషయ్య, నవీన్, సృజన, సుజాత, లక్ష్మి, డీడీపీఎంలు, ఏసీలు, ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్‌సీసీలు, అకౌంటెంట్స్, జిల్లా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు