వైస్‌ ఎంపీపీ కుమారుడు దుర్మరణం

13 Dec, 2018 13:20 IST|Sakshi
రోడ్డు ప్రమాదానికి గురై కారులో విగతజీవిగా పడి ఉన్న రవికిరణ్‌ రవికిరణ్‌ (ఫైల్‌)

 హైవేపై రోడ్డు ప్రమాదం

కారు అదుపు తప్పి లారీని ఢీకొన్న వైనం

ఒకరికి తీవ్ర గాయాలు

కృష్ణాజిల్లా, బొమ్ములూరు (హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌): చెన్నై– కోల్‌కత్తా జాతీయ రహదారిపై హనుమాన్‌జంక్షన్‌ శివారులోని రామిలేరు వంతెన వద్ద  మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో బాపులపాడు వైస్‌ ఎంపీపీ గుళ్లపూడి సరోజాదేవి కుమారుడు రవికిరణ్‌ (35) దుర్మరణం చెందాడు. మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గుళ్లపూడి రవికిరణ్‌ మంగళవారం విధులు ముగించుకుని కారులో సొంత ఊరు బాపులపాడు మండలం బొమ్ములూరు వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో రామిలేరు వంతెన డౌన్‌లో రవికిరణ్‌ నడుపుతున్న కారు, బైక్‌ను ఢీకొట్టింది. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీ వెనుక భాగాన్ని ఢీకొనటంతో కారు ముందు భాగం లారీ కింద ఇరుక్కుపోయింది. దాదాపు రెండు గంటల పాటు పోలీసులు శ్రమించి రవికిరణ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. మరో రెండు నిమషాల్లో కారులో రవికిరణ్‌ ఇంటికి చేరుకునే సమయంలోనే ప్రమాదానికి గురై అనంతలోకాలకు చేరుకున్నాడు. కాగా, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన టీడీపీ నేత కుడుపూడి దినేష్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. కారు వేగంగా ఢీకొనటంతో దినేష్‌ కుమార్‌ ఎడమకాలు పూర్తిగా తెగిపోయి అవతల పడింది. హనుమాన్‌జంక్షన్‌ 108లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుళ్లపూడి రవికిరణ్‌ మృతదేహానికి నూజివీడు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

పలువురు ప్రముఖుల నివాళి..
గుళ్లపూడి రవికిరణ్‌ మృతదేహానికి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్శించిన వారిలో జాయింట్‌ కలెక్టర్‌ విజయ కృష్ణన్, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్, జిల్లా పౌరసరఫరాల అధికారి డి.నాగేశ్వరరావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహాన్, ఎంపీపీ తుమ్మల కోమలి, జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కె.విక్టర్‌ పాల్, శ్రవంతి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ వీరమాచినేని సత్యప్రసాద్, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కొల్లి వెంకట్రావు, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి ఎం.మాధురి, ఇ–సెక్షన్‌ సూపరింటెండెంట్‌ సుధారాణి, మచిలీపట్నం ఆర్‌డీఓ కార్యాలయం ఏవో సి.హెచ్‌.చంద్రశేఖర్, బాపులపాడు, గన్నవరం తహసీల్దార్లు ముత్యాల శ్రీనివాస్, కలగర గోపాలకృష్ణ, డిప్యూటి తహసీల్దార్‌ కిరణ్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు