హస్త విధీ!

15 Mar, 2014 02:57 IST|Sakshi
హస్త విధీ!

 జయజయ ధ్వనాలు.. నేతల అడుగులకు మడుగులొత్తే అనుచరగణంతో నిన్నటివరకు అధికార భోగం అనుభవించిన కాంగ్రెస్ నేడు పిలిచినా పలికే నాథుడు లేని దీనావస్థలోకి జారుకుంది. ఎన్నికల్లో అవకాశం కోసం నిన్నటి వరకు వెంపర్లాడిన కాంగ్రెస్ శ్రేణులు నేడు ఆ ఊసెత్తితేనే ఆమడ దూరం పారిపోతున్నారు.

కనిపిస్తే.. ఎక్కడ బలవంతంగా పోటీలోకి దింపుతారోనన్న భయంతో ముఖం చాటేశారు. అనేక మంది వేరే దారులు వెతుక్కుంటున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం జిల్లాలో కాంగ్రెస్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేకత వార్డుస్థాయి ఎన్నికల్లో సైతం నిలబడేందుకు వెనుకంజ వేసేలా చేసింది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో చాలా వార్డులకు ఆ పార్టీ అభ్యర్థులు లేకపోవడమే దీనికి నిదర్శనం.
 
 శ్రీకాకుళం  మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా వాటిలో పలు వార్డులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది. ఏకంగా మూడు చోట్ల అత్యధిక వార్డుల్లో నామినేషన్లు వేయలేని దుస్థితిలో  పడిపోయింది. ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, పాలకొండ మున్సిపాలిటీల్లో మొత్తం 91 వార్డులుండగా, వాటిలోని 31 వార్డుల్లో ఆ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు కాలేదు.

 వార్డుల్లో దొరకని అభ్యర్థులు..!
 

కనీసం వార్డు బరిలో దిగేందుకు కూడా కాంగ్రెస్ శ్రేణు లు ముందుకు రాకపోవడంతో జిల్లా కాంగ్రెస్ పెద్దలు  తలలు పట్టుకుంటున్నారు. నామినేషన్ల స్వీకరణ గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసిపోగా.. చివరి క్షణం వరకు అభ్యర్థుల కోసం ఈ పార్టీ నేతలు ప్రయత్నాలు సాగించినా ఫలితం లేకపోయింది.

ఇచ్ఛాపురంలో 1, 2, 3, 19, 21, 22.. మొత్తం ఆరు వార్డుల్లో, పలాస-కాశీబుగ్గలో 1, 2, 6, 8, 12, 15, 17, 19, 20.. మొత్తం 9 వార్డుల్లోనూ, పాలకొండ నగర పంచాయతీలో అత్యధికంగా 1, 2, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17.. మొత్తం 13 వార్డుల్లోనూ, ఆమదాలవలసలో 3, 7, 23.. మొత్తం మూడు వార్డుల్లోను కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలు కాలేదు. వీటిలో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మున్సిపాలిటీలు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోవే కావడం విశేషం. గతంలో ఎన్నడూ లేనివిధంగా మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల కొరత, కాంగ్రెస్ పతనావస్థను స్పష్టం చేస్తోంది. గతంలో ఇదే కాంగ్రెస్ తరపున వార్డు స్థానాల కోసం పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో వివాదాలు, గొడవలు జరిగిన విషయం విదితమే.

తాజా పరిణామల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందుగానే నామినేషన్ల దశలోనే కాడి దించేసినట్లేనని ఆ నేతలే అంగీకరిస్తునారు. రాష్ట్ర విభజన అంశమే తమ కొంప ముంచిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మద్దతిచ్చేందుకు సిద్ధం కావడంతో రాన్ను మున్సిపల్‌తో పాటు సాధారణ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు గడ్డు పరిస్థితులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

మరిన్ని వార్తలు