అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్‌ సిగ్నల్‌

25 Nov, 2019 19:17 IST|Sakshi

గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం ఖరారు: గడ్కరీ

సాక్షి, న్యూఢిల్లీ: అనంతపురం-అమరావతి యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం ఖరారు చేసినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. 384 కిలోమీటర్ల పొడవు అలైన్‌మెంట్‌తో ఈ రహదారి నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి రాజ్యసభలో సోమవారం అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా గ్రాండ్‌ చాలెంజ్‌ కింద కొత్తగా రహదారి ప్రాజెక్ట్‌లు చేపట్టవలసిందిగా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరవచ్చునని ఆయన తెలిపారు. అయితే అలాంటి ప్రాజెక్ట్‌ల్లో భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించడానికి ఆయా రాష్ట్రాలు ముందుకు వస్తే మిగిలిన వ్యయంతోపాటు ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయాన్ని కూడా కేంద్రమే భరిస్తుందని చెప్పారు. అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అనేక మార్లు రవాణా శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులతో సమావేశాలు నిర్వహించారని తెలిపారు.

‘భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పర్యావరణ, అటవీ, వన్యప్రాణుల శాఖల నుంచి చట్టబద్దమైన అనుమతులు తీసుకునే చర్యలను త్వరితగతిన పూర్తి చేయబోతున్నాం. నిర్మాణ పనులు ఆరంభించడానికి ముందుగా పొందవలసిన చట్టబద్దమైన అనుమతులు, నిధుల లభ్యతను బట్టి ప్రాజెక్ట్‌ పనులను మొదలుపెడతాం. అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను 12 ప్యాకేజీల కింద చేపట్టేలా సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌)లో పేర్కొన్నప్పటికీ.. ఎన్ని ప్యాకేజీల కింద పనులు చేపట్టాలన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేద’ని గడ్కరీ వివరించారు.

పోటీ తట్టుకోలేని పరిశ్రమలే మూతబడుతున్నాయి..
మార్కెట్‌లో పోటీని తట్టుకోలేక, గిట్టుబాటు కానందునే కొన్ని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎఈ) మూతబడుతున్నాయని చిన్న పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. అలాగే ఎంఎస్‌ఎంఈలకు నాణ్యమైన పనిముట్లు, మానవ వనరులు సమకూర్చేందుకు, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌, ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ అంశాలపై సలహాలు ఇచ్చేందుకు తమ మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా 18 టెక్నాలజీ సెంటర్లను నిర్వహిస్తోందని అన్నారు. ‘వీటి ద్వారా ఎంఎస్‌ఎంఈలకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌, టెక్నాలజీ సహాయాన్ని అందిస్తోంది. క్రెడిట్‌ లింక్డ్‌ కాపిటల్‌ సబ్సిడీ అండ్‌ టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌ స్కీం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతోంది. ఎంఎస్‌ఎంఈల సామర్థ్యం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రుణ సంబంధ విషయాలు, మౌలిక వసతుల మద్దతు, వ్యాపార దక్షత, టెక్నాలజీ వినియోగం, ప్రపంచ ఆర్థిక, వాణిజ్య రంగాల పని తీరు వంటి అంశాలు ఎంఎస్‌ఎంఈల సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయ’ని మంత్రి వెల్లడించారు.

మరిన్ని వార్తలు